
కృష్ణా నదిలో దూకిన ఓ విద్యార్థినిని అవనిగడ్డ పోలీసులు రక్షించారు. పులిగడ్డ – పెనుముడి వారధి పైనుండి ఓ యువతి కృష్ణానదిలోకి దూకింది. దగ్గర్లోనే పోలీసులు నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువతి నదిలోకి దూకుతుండగా చూసిన వాహనదారులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటన స్థలానికి వెళ్లారు. అవనిగడ్డ ASI మాణిక్యాలరావు నదిలోకి దూకిన ఆ యువతిని ఒడ్డుకు చేర్చారు. ఆ యువతిని అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. యువతిని కాపాడిన ASI మాణిక్యాలరావును స్థానికులు, పోలీసులు అభినందించారు. ASI మాణిక్యాలరావు మరికొన్ని రోజుల్లోనే రిటైర్మెంట్ కానున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.