
పట్టపగలు.. సూర్యుడు ఉదయించే సమయం.. ఎంతో ప్రశాంతమైన హైదరాబాద్ వాతావరణం.. వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన.. ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్న చందు నాయక్.. ఈ వాకింగ్ అతని జీవితంలో చివరిది అయ్యి ఉంటుందని ఊహించి ఉండడు.. వాకింగ్ కోసం దిల్ సుఖ్ నగర్ సమీపంలోని పార్క్ దగ్గరకు వచ్చిన చందు నాయక్ ను.. కొందరు దుండగులు తుపాకీలతో కాల్చి చంపారు.. బుల్లెట్ల వర్షం కురిపించారు.. ఇంతకీ వాళ్లు ఎవరు.. వాళ్లకు తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి.. తుపాకులతో కాల్చి చంపటం అంటే ఇది మామూలు వ్యక్తుల పని కాదు.. పట్టపగలు.. నడిరోడ్డుపై.. తుపాకీతో కాల్చి చంపటం అనేది హైదరాబాద్ సిటీని షాక్ కు గురి చేసింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
జులై 15న ఉదయం 7:30 సమయంలో శాలివాహన నగర్లో పార్క్ ముందు ఫైరింగ్ జరిగింది. చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో ఏడు బుల్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దుండగులు ఎన్ని గన్నులు వాడారు అనేది దర్యాప్తులో తెలుస్తుంది.
పక్కా ప్లాన్ ప్రకారమే చందు నాయక్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది. సీపీఐ ఎంఎల్ రాజేష్ తో చందు నాయక్ కు మధ్య వివాదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నాగోల్ ప్రభుత్వ స్థలంలో కొంతమంది ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. దాంతో అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులే చందు నాయక్ ప్రత్యర్థులుగా మారారని ఆరోపణలు వస్తున్నాయి.
చందు నాయక్ ను చంపిన దుండుగులు జులై 15న ఉదయం చందు నాయక్ ఇంటి వద్ద దుండగులు రెక్కి చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్థానిక సీసీ టీవీ ఫుటేజ్ లో ఒకరిద్దరు అనుమానస్పందంగా చందు నాయక్ ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అనంతరం కాసేపటికే దుండగులు పార్క్ ముందు ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు. పార్క్ ముందు హత్య జరిగిన సంఘటన స్థలంలో క్లూస్ సేకరించిన పోలీసులు.. నిందితుల కోసం డాగ్స్ స్క్వాడ్ ను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు.
షిఫ్ట్ కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు ఈ కాల్పులు జరిపి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితుల కోసం 10 టీమ్స్ గాలిస్తున్నాయి. చందు నాయక్ 2022 సంవత్సరంలో ఎల్బీనగర్ లో ఓ మర్డర్ కేసులో నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో చందు నాయక్ పై ఉన్న కేసుల గురించి ఆరా తీస్తున్నారు.