
విదేశీ జైళ్లలో మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియ కేసు, దేశవ్యాప్తంగా సానుభూతిని, ఆందోళనను రేకెత్తిస్తోంది. అయితే తాజాగా భారత బృందం చేపడుతున్న చర్చల కారణంగా జూలై 17న ఉన్న ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. అయితే ఇలాంటి కేసులు ఇంకా చాలానే ఉన్నాయనే విషయం తాజాగా చర్చకు దారితీసింది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో నిమిషా ప్రియ వంటి దురదృష్టవంతులు వేల సంఖ్యలో ఉన్నారన్న చేదు నిజాన్ని ఈ కేసు వెలుగులోకి తెచ్చింది. విదేశాల్లోని జైళ్లలో 10వేల మందికి పైగా భారతీయులు నిర్బంధంలో ఉండగా, అందులో 49 మంది మరణశిక్ష అమలు కానున్న ఆందోళనలో కాలం వెళ్లదీస్తున్నారు.
అసలు ఏంటి ఈ నిమిషా ప్రియ కేసు..
యెమెన్‌లో నర్సుగా పనిచేసిన నిమిషా ప్రియ, 2017లో అక్కడి ఒక వ్యాపారవేత్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలింది. యెమెన్ చట్టాల ప్రకారం ఆమెకు మరణశిక్ష విధించబడింది. ఆమెను రక్షించడానికి భారత ప్రభుత్వం, కేరళకు చెందిన సామాజిక కార్యకర్తలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిమిషాకు లభిస్తున్నంత మీడియా ప్రచారం, మద్దతు వేలాది మంది ఇతర దేశపు జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు దక్కడం లేదనేది వాస్తవం.
విదేశాంగ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 10వేల మందికి పైగా భారతీయులు జైళ్లలో ఖైదీలుగా ఉన్నారు. వీరు డ్రగ్స్ స్మగ్లింగ్, హత్య, ఆర్థిక నేరాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన వంటి అనేక రకాల కేసుల్లో చిక్కుకుపోయారు. ఈ సంఖ్య కేవలం అధికారికంగా గుర్తించబడిన కేసులు మాత్రమే. గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో అత్యధిక సంఖ్యలో భారతీయులు ఉన్నారు, ఆ తర్వాత ఆసియా, యూరోప్, ఆఫ్రికా దేశా కారాగారాల్లో ఇండియన్స్ శిక్ష అనుభవిస్తున్నారు.
విదేశాల్లోని స్థానిక చట్టాలపై అవగాహన లేమిగా తెలుస్తోంది. చాలా మంది విదేశాలకు వెళ్లే ముందు ఆయా దేశాల చట్టాలపై సరైన అవగాహన కలిగి ఉండరు. తెలియక చేసిన చిన్న పొరపాట్లు కూడా పెద్ద నేరాలుగా పరిణించబడి చివరికి జైలు పాలు చేస్తున్నాయి. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ వంటి సమస్యలతో పాటు డబ్బులకు ఆశపడి డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ వంటి నేరాల్లో చిక్కుకోవటం కఠిన శిక్షలకు దారితీస్తోంది. కొందరు ఇతర దేశాల్లో వారి సామాజిక, సాంస్కృతిక అంశాలపై అవగాహన లేకపోవటం వల్ల ఉల్లంఘనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరికి వీరికి పేదరికం, ఆర్థిక స్థోమత లేకపోవటం, స్థానిక స్థానిక న్యాయ వ్యవస్థపై అవగాహన లేకపోవడం వల్ల సరైన న్యాయ సహాయం కూడా అందక జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి వానికి విదేశీ జైళ్ల నుంచి వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తోంది. కానీ కొన్ని దేశాల కఠినమైన చట్టాలు, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే అంతర్జాతీయ నిబంధనలు పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి.
భారత ప్రభుత్వం తమ పౌరులను విదేశీ జైళ్ల నుండి విడిపించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తోంది. కానీ కొన్ని దేశాల కఠినమైన చట్టాలు, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే అంతర్జాతీయ నిబంధనలు పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా మరణశిక్ష కేసుల్లో ఇది మరింత సంక్లిష్టంగా ఉంటుంది. బాధితుల కుటుంబాలకు కౌన్సిలింగ్, న్యాయ సహాయం అందించడంలో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి.
విదేశాల్లో జైలుపాలు కాకుండా ఈ విషయాలు తెలుసుకోండి..
- ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్: విదేశాలకు వెళ్లే ముందు స్థానిక చట్టాలు, నిబంధనలు, కల్చర్ గురించి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
- లీగల్ అసిస్టెన్స్: విదేశాల్లో భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు తమ పౌరులకు సకాలంలో న్యాయ సహాయం అందించే వ్యవస్థను బలోపేతం చేయాలి.
- మోసాల పట్ల జాగ్రత్త: విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి.
- మానవతా దృక్పథం: మరణశిక్షకు గురైన వారి కేసుల్లో దౌత్యపరమైన ఒత్తిడిని కొనసాగించాలి.
నిమిషా ప్రియ కేసు ఒక కనువిప్పు కావాలి. విదేశీ గడ్డపై ఉన్న ప్రతి భారతీయుడి భద్రత, హక్కులు కాపాడబడేలా బలోపేతమైన వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి నిమిషా ప్రియల సంఖ్య నిశ్శబ్దంగా పెరుగుతూ పోతుంది.