
- ప్రజాపాలన, గ్రామసభలు, ప్రజావాణి, మీసేవ ద్వారా దరఖాస్తులు
- ఎంక్వైరీ పేరుతో కొర్రీలు పెడుతున్న అధికారులు
- హైదరాబాద్లోని పలు చోట్ల క్షేత్ర స్థాయి విచారణకు రానీ టీమ్స్
- కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభించిన సీఎం
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభించింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. పలు దఫాలుగా 25 లక్షల దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 5 లక్షల 61 వేల కార్డులే కావడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంతో పాటు గ్రామ సభలు, కలెక్టరేట్లు, ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలతో పాటు తాజాగా మీసేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించింది. అన్ని మార్గాల ద్వారా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
అయితే అందులో చాలా మటుకు బుట్టదాఖలయ్యాయని తెలుస్తోంది. వివిధ కారణాలతో కొన్ని పెండింగ్లో పెట్టారు. పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని సమాచారం. అధికారులు ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్లకుండానే డోర్ లాక్ అని నాట్ అవైలబుల్ అని రాసి వాటిని పెండింగ్లోకి నెట్టేసినట్టు సమాచారం. హైదరాబాద్ మహానగరంలోని మెజార్టీ ప్రాంతాల్లో అసలు విచారణకు అధికారులెవరూ రాలేదని తెలుస్తోంది. స్టాఫ్ సమస్య కారణంగా వాటి జోలికి వెళ్లడం లేదని ఓ అధికారి తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. వాటిని చూపుతూ అనవసరంగా రిజెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
మార్పులు, చేర్పులు పెండింగ్
ప్రభుత్వం కొత్త కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. దీంతో చాలా మంది కొత్తగా పెళ్లయిన కోడళ్ల పేర్లు ఎంట్రీ చేయించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా కొందరు తమ బిడ్డల పేర్లను ఎంట్రీ చేయించేందుకు అప్లయ్ చేశారు. వీటిలో ఎక్కువ భాగం పెడింగ్లో ఉన్నాయి. అధికారులు ఫీల్డ్ విజిట్కు రావడం లేదని, దీంతో తమ ఇద్దరు బిడ్డలకు సంబంధించిన మూడు నెలల రేషన్ కోల్పోయామని నిజామాబాద్కు చెందిన కిషన్ ఆవేదన వ్యక్తం చేశారు.
►ALSO READ | బీఆర్ఎస్ హయాంలో బెల్ట్ షాపులు తెరిస్తే.. మేం రేషన్ షాపులు తెరిచాం
రెంటికీ చెడ్డ రేవడి
కార్డులలో యాడింగ్, డిలీట్లోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. కొత్తగా పెళ్లయిన వారి పేర్లను అత్తగారింటి రేషన్ కార్డుల్లో చేర్చుకునేందుకు సర్కారు అవకాశం కల్పించింది. తల్లి గారింటి కార్డులో పేరు తొలగించుకొని.. ఆ ఆధార్ నంబర్తో అత్తగారింటి కార్డులో యాడింగ్ కు దరఖాస్తు చేసుకుంటున్న వారు అవస్థలు పడుతున్నారు. కొత్తవి యాడ్ కావడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మహేశ్ చెప్పారు. తమ అత్తగారి ఊళ్లో మాత్రం డిలీట్ అయ్యిందని తెలిపారు. దీంతో ఆమె పేరు రెండింటిలో ఏ కార్డులోనూ లేకుండా పోయిందని చెప్పారు.