
చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది.. ఆవులకు గడ్డి కోయడానికి పొలానికి వెళ్తున్న యువతిపై అడవి పందులు దాడి చేశాయి. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( జులై 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కుప్పంలోని వీ. మిట్టపల్లి గ్రామానికి చెందిన మీనాక్షి అనే యువతి ఆవులకు గడ్డి కోయడం కోసం పొలానికి వెళ్తుండగా.. ఆమెపై అడవి పందులు దాడి చేసినట్లు తెలుస్తోంది.
అడవి పందుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మీనాక్షిని చికిత్స కోసం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వాపోతున్నారు మీనాక్షి కుటుంబసభ్యులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
అడవి పందుల సంచారం వల్ల పొలం పనులకు వెళ్లాలంటేనే భయంగా ఉందని.. ఎప్పుడు, ఏవైపు నుంచి అడవి పందులు దాడి చేస్తాయో అని వణికిపోతున్నామని అంటున్నారు గ్రామస్తులు. అటవీ అధికారులు తగిన చర్యలు చేపట్టి అడవి పందుల బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు గ్రామస్తులు.