
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'రామాయణం' ( Ramayana ). ఈ మూవీ తొలి ప్రోమో విడుదలతోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడు దీని బడ్జెట్ వివరాలు సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఓ సరికొత్త మైలురాయిని సృష్టించబోతోందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఊహించని బడ్జెట్!
రామాయణం చిత్ర నిర్మాణంపై ఇటీవల నిర్మాత నమిత్ మల్హోత్రా ( Namit Malhotra ) ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. అంతే కాదు ఈ రెండు భాగాలకు కలిపి బడ్జెట్ రూ . 4 వేల కోట్లకు పైగా ఉంటుందని ప్రకటించారు. ఇండియన్ మూవీ చరిత్రలో ఏ చిత్రానికి ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించింది లేదు. 'రామాయణం' బడ్జెట్ కు ఏ సినిమా కూడా దరిదాపుల్లో కూడా లేదని ఆయన తెలిపారు. నమిత్ ప్రకటన ఇప్పుడు భారతీయ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read:-హైదరాబాద్‌లో ప్రభాస్ సందడి.. వైరల్ అవుతున్న 'F1' మూవీ నైట్ పిక్స్!
రెండు భాగాలుగా 'రామాయణం'
'రామాయణం' మూవీ కేవలం భారతీయ ప్రేక్షకులను కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఆకట్టుకునే రూపొందిస్తున్నట్లు నమిత్ తెలిపారు. ఒక గొప్ప ఇతిహాసంతో కూడిన ఈ చిత్రంలో ఎక్కడా పొరపాటుకు తావు లేకుండా .. ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నిర్మాణ వ్యయంతో పాటు సినిమా నాణ్యతపై రాజీపడేది లేదు. దర్శకుడు నితీష్ తివారీ ( Nitesh Tiwari ) ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ముందు విస్తృతమైన పరిశోధన చేశారని వెల్లడించారు. 'రామాయణం' రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. అత్యున్నతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు, యాక్షన్ సన్నివేశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరో వైపు హాలీవుడ్ స్టూడియోతో ప్రపంచవ్యాప్త పంపిణీకి కూడా నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం.
భారీ తారాగణంతో ' రామాయణం' రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది . ఈ మూవీలో రాముడిగా రణ్ బీర్ కపూర్ ( Ranbir Kapoor ) , సీతగా సాయి పల్లవి ( Sai Pallavi ) , లక్ష్మణుడుగా రవి దూబే (Ravi Dubey ), హనుమాన్ గా సన్నీడియోల్( Sunny Deol )నటిస్తున్నారు. ఇతర తారాగణంలో అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఇందిరా కృష్ణన్, షీబా చద్దా, మోహిత్ రైనా, కునాల్ కపూర్, వివేక్ ఒబెరాయ్, శోభన, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు నటిస్తున్నట్లు సమాచారం. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ ( AR Rahman ), హాన్స్ జిమ్మర్ (Hans Zimmer ) కలిసి సంగీతం అందిస్తున్నారు. 'రామాయణం' మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఇక రెండో భాగం 2027 దీపావళికి థియేటర్లలోకి రానుంది. పండుగ సీజన్‌లో విడుదల కావడం వల్ల సినిమా వసూళ్లకు కూడా సానుకూలంగా ఉంటుందని మూవీ మేకర్స్ అంచనా వేస్తున్నారు.