షాకింగ్ రిపోర్ట్: ఆయుధాలు ఇస్తాం.. రష్యా రాజధానిపై దాడి చేయండి: ఉక్రెయిన్ ప్రసిడెంట్ను కోరిన ట్రంప్

షాకింగ్ రిపోర్ట్: ఆయుధాలు ఇస్తాం.. రష్యా రాజధానిపై దాడి చేయండి: ఉక్రెయిన్ ప్రసిడెంట్ను కోరిన ట్రంప్

ఇదైతే షాకింగ్ రిపోర్టే.. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నం చేసిన ట్రంప్.. మూడో ప్రంపచ యుద్ధం రాకుండా ఉండాలంటే యుద్ధం ఆపాలని చెప్పిన అమెరికా అధ్యక్షుడు.. ఏకంగా రష్యాపై దాడి చేయాలని.. అందుకు కావాల్సినా ఆయుధాలను కూడా ఇస్తామనేలా మాట్లాడటం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. జెలెన్ స్కీతో ట్రంప్ మాట్లాడిన సంభాషణపై షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ గురించి తెలుసుకునే ముందు.. ట్రంప్ వ్యవహారశైలి ఎలా గంట గంటకూ.. రోజు రోజుకూ ఎలా మారుతుంది.. ఒకవైపు శాంతి మంత్రం జపిస్తూనే.. మరోవైపు యుద్ధం వైపు ఎలా ప్రోత్సహిస్తున్నాడో చర్చిద్దాం. ఆ తర్వాత ఏఏ అంశాలు చర్చించారో మాట్లాడుకుందాం.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత చిత్ర విచిత్రమైన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఒకవైపు టారిఫ్ వార్ అంటూ అంతర్జాతీయ వాణిజ్యాన్ని డిస్టర్బ్ చేశాడు. మరోవైపు వివిధ దేశాలకు పెద్దన్న పాత్రలో చేసే ఆర్థిక సాయాన్ని నిలిపివేశాడు. వలసదారులపై కఠిన నిబంధనలు తీసుకొచ్చాడు. ఇంకా ఏం చేసిన చెల్లుతుందిలే అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. 

ఇది కాకుండా కొన్ని సందర్భాలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్లు వివిధ దేశాల మధ్య సంధికి ప్రయత్నిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నాడు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో యుద్ధాన్ని ఆపాలని చెప్తూనే.. ఇజ్రాయెల్ పక్షం తీసుకుని ఇరాన్ పై దాడి చేయించాడు. ఇండియా-పాకిస్తాన్ యుద్ధ సమయంలో.. ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకోవడానికి కారణం తానేనని.. యుద్ధాన్ని ఆపినందుకు తనకు నోబెల్ ప్రైజ్ రావాలని కూడా ఆశించాడు. కానీ అదే సమయంలో పాక్ ఆర్మీ జనరల్ ను అమెరికాకు పిలిపించి డిన్నర్ పార్టీ ఇచ్చి.. లోగుట్టు వేరే ఉందనే సంకేతాలు పంపాడు. అమెరికా ఆయుధాలు అమ్ముకునేందుకు పాక్ ను యుద్ధానికి ప్రోత్సహిస్తున్నాడనే విమర్శలు కూడా వచ్చాయి. 

 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో శాంతి కోసం ప్రయత్నిస్తానని చెప్పి కొన్నాళ్లు చర్చలు నడిపాడు. ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడినే అమెరికాకు రప్పించి.. యుద్ధం ఆపాలని సూచించాడు. ఈ విషయంలో బహిరంగంగానే ఉక్రెయిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్ వ్యవహారం చూస్తుంటే ప్రపంచ యుద్ధానికి పునాదులు వేసేలా ఉన్నాడని వ్యాఖ్యానించాడు. దీంతో సమావేశం మధ్యలోనే ఉక్రెయన్ ప్రసిడెంట్ జెలెన్ స్కీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. 

యుద్ధం ఆపటానికి రష్యా ముందుకు వస్తుందని.. కానీ ఉక్రెయినే యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటుందని.. ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అభినందిస్తున్నట్లు ప్రకటిస్తూ వస్తున్నాడు ట్రంప్. మరోవైపు కొన్ని శతాబ్దాలుగా రష్యా, అమెరికాకు ఉన్న వైరాన్ని తగ్గించనున్నట్లుగా.. రష్యాతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తామని కూడా ప్రకటించాడు. కానీ లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక అన్నట్లు.. బయటకి పుతిన్ ను పొగుడుతూ.. రష్యాతో మైత్రి పూర్వక వ్యాఖ్యానాలు చేస్తూ.. లోలోపల మాత్రం చేయాల్సింది చేస్తున్నాడు ట్రంప్ అని ఒక రిపోర్ట్ లో వెల్లడైంది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రైవేట్ గా  మాట్లాడిన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆయుధాలు ఇస్తే.. రష్యాపై దాడి చేయగలరా..? అని ట్రంప్ అడిగినట్లు బయటకు వచ్చిన ఈ రిపోర్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. రష్యా లోకి డీప్ గా వెళ్లి దాడి చేయాలని.. రష్యా రాజధాని మాస్కోతో పాటు సెయింట్ పీటర్ బర్గ్ పై కూడా దాడి చేయగలరా.. అని జెలెన్ స్కీని అడగటం సంచలనంగా మారింది. 

వ్లాదిమిర్.. మాస్కో పై దాడి చేయగలరా.. సెయింట్ పీటర్ బర్గ్ పై కూడా.. కావాల్సినన్ని ఆయుధాలు ఇస్తాం.. అంటూ జులై 4న జెలెన్ స్కీతో జరిగిన సీక్రెట్ కాల్ సందర్భంగా ట్రంప్ అడిగినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ లో పేర్కొంది.  దీనికి రిప్లై గా..  తప్పకుండా దాడి చేస్తాం.. మీరు ఆయుధాలు ఇస్తే ఏదైనా చేస్తాం.. అని జెలెన్ స్కీ రిప్లై ఇచ్చాడట. 

ఈ ఫోన్ సంభాషణకు ముందు ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడారు. ఆ సందర్భంగా బ్యాడ్ కన్వర్జేషన్ అంటూ బహిరంగ ప్రకటన చేశాడు. ఆ తర్వాతి రోజే ఉక్రెయిన్ ప్రసిడెంట్ తో మాట్లాడటం గమనార్హం. కాల్పుల విరమణపై రష్యాతో మాట్లాడినప్పుడు.. దానికి పుతిన్ ఒప్పుకోలేదని.. ఆ తర్వాత ఉక్రెయిన్ ను రెచ్చగొడుతూ.. రష్యాపై దాడికి ప్రోత్సహించినట్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు.