
సమోసా, జిలేబీని ఇష్టంగా తినేవాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఒక చేదు విషయం చెప్పింది. సిగరెట్ ప్యాకెట్లపై, గుట్కా ప్యాకెట్లపై ఉండే హెల్త్ వార్నింగ్ మెసేజ్లు ఇకపై ఈ స్నాక్స్ అమ్మే దగ్గర కూడా పోస్టర్లు, బోర్డుల రూపంలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిగరెట్ త్రాగడం ఆరోగ్యానికి హానికరం తరహాలో సమోసా, జిలేబీ తినడం ఆరోగ్యానికి హానికరం అని ఇకపై అవి అమ్మే స్టాల్స్ దగ్గర పోస్టర్లు కనిపించనున్నాయి.
నాగ్పూర్ ఎయిమ్స్ (Nagpur AIIMS) క్యాంపస్లోని కేఫెటేరియాస్లో తొలుత ప్రయోగాత్మకంగా ఈ ప్రచారం మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిలేబీ, సమోసాలే కాదు పకోడీలు, వడాపావ్, ఛాయ్ బిస్కట్ల గురించి కూడా ఈ హెల్త్ వార్నింగ్ బోర్డులు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఆ తిను బండారాల్లో అధికంగా ఉండే నూనె, చక్కెర కారణంగా ఎలా రోగాల బారిన పడుతున్నారో తెలిపేలా ఈ వార్నింగ్ బోర్డులు ఉండనున్నాయి. ఈ ప్రచారం ఎందుకనే ప్రశ్నకు కేంద్రం తాజాగా వివరణ ఇచ్చింది.
భారత్లో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోట్లు రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లపై ప్రజలు శ్రద్ధ వహించాలని తెలిపే ఉద్దేశంతో ఈ హెల్త్ వార్నింగ్ పెట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఈ తిను బండారాలను నిషేధించే ఉద్దేశం ఏమాత్రం లేదని.. కాకపోతే ప్రజలు ఏం తింటున్నారనే విషయం వాళ్లకు తెలియజెప్పడమే తమ ఉద్దేశం అని కేంద్రం తెలిపింది. కొన్ని నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఈ హెల్త్ వార్నింగ్ బోర్డులు, పోస్టర్లు కనిపించనున్నాయి.
మితమైన ఆహారం తీసుకోవడం, రుచి కోసం వెంపర్లాడకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. వంటి లక్షణాలకు ప్రజలను అలవాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పునుగులు, బజ్జీలు అంటే అంతగా ఇష్టపడని వాళ్లు సాయంత్రం స్నాక్స్ బ్రేక్లో తినే తిను బండారాల్లో సమోసా, జిలేబీ ముందు వరుసలో ఉంటాయి. హైదరాబాద్ లాంటి సిటీల్లో అయితే ఏ రోడ్డు పక్కన చూసినా ఎక్కువగా ఈ సమోసా, జిలేబీ స్టాల్సే కనిపిస్తుంటాయి.
వేడి వేడి పాకంలో ముంచి లేపుతున్న జిలేబీ చుట్లను చూసి.. వెంటనే ఆర్డర్ చేసి లొట్టలేసుకుని తింటూ ఉంటారు. అలాగే.. ఈ జిలేబీ బదులు హాట్ తినాలనుకునే వాళ్లు గరంగరం సమోసా తిని ఒక ఛాయ్ తాగి రిలాక్స్ అవుతుంటారు. మరి ఇలాంటి తిను బండారాల ప్రియులు ఆ బోర్డులు చూసి భయపడి తినడం తగ్గిస్తారో లేక సిగరెట్ ప్యాకెట్ల మీద పుర్రె బొమ్మలు చూసినా లైట్ తీస్కొని గుప్పుగుప్పుమని పొగ పీల్చి బతికేసే పొగరాయుళ్ల మాదిరిగా తయారవుతారో చూడాలి.