
గతంలో మాదిరిగా ఇంట్లోని మగవారు సంపాదిస్తుంటే కుటుంబ పోషనను మహిళలు చూసుకుంటూ ఉండేవారు. ప్రస్తుత కాలంలో భార్య భర్త ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఎవరి ఉద్యోగాల్లో వారు బిజీగా గడుపుతున్న కాలం ఇది. పెరుగుతున్న ఖర్చులు, అవసరాలు, మారుతున్న జీవనశైలి ఇలా అనేక కారణాలు భార్యాభర్తలిద్దరూ కష్టపడాల్సిన పరిస్థితులను తీసుకొచ్చాయి. అయితే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న కుటుంబాల్లో వారి ప్రవర్తనకు సంబంధించిన విషయాలు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త ఆయుష్మాన్ కపూర్ తన లింక్డిన్ ఖాతాలో ఇలాంటి ఒక ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నారు. గురుగ్రామ్ ప్రాంతంలో తనకు తెలిసిన ఒక భార్యా భర్తలు ఏడాదికి చిరో రూ.30 లక్షలు వేతనంగా అందుకుంటున్నారని కపూర్ చెప్పారు. ఇంత సంపాదిస్తున్నప్పటికీ వారు ఫ్లాట్ మేట్స్ మాదిరిగా ఉన్నట్లు చెప్పారు. పెళ్లి చేసుకున్న జంట లాగా కాకుండా వారు ఖర్చు చేస్తున్న బిల్లులను చిరో సగం విభజించుకుంటూ రికార్డ్స్ కలిగి ఉన్నట్లు చెప్పారు.
ఇంటి అద్దె, కిరాణా సరుకులు, కూరగాయలు, పాల బిల్లు, పెట్రోల్ ఖర్చుల నుంచి ఆఖరికి స్విగ్గీ జొమాటో ఆర్డర్ల బిల్లులను కూడా భార్యా భర్తలు సమానంగా చెల్లిస్తున్నట్లు కపూర్ చెప్పారు. వారి ప్రవర్తన తనను అయోమయానికి గురిచేసిందని, తనకు ఇబ్బంది కలిగించిందని అనుభవాన్ని పంచుకున్నారు. అసలు ఎక్కడైనా భార్యా భర్తలు ఇలా ఉంటారా.. ఎంత సంపాదిస్తే మాత్రం ఖర్చు చేసిన ప్రతి రూపాయినీ చిరో సగం చెల్లించటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
ALSO READ : 15 వందలు ఉన్నాయా..? విమానాన్ని గాల్లో చూసింది చాలు.. మీరూ ఎక్కే టైమొచ్చింది !
వాస్తవానికి పెళ్లి కూడా ఒక విధంగా కంపెనీ ఏర్పాటు చేయటం లాంటిదేనని కపూర్ అన్నారు. సహ వ్యవస్థాపకులు ఇద్దరూ వేరువేరు లక్ష్యాలను కలిగి ఉండటం గందరగోళానికి గురిచేయటంతో పాటు వారిని విజయం వైపు నడిపించదని అన్నారు. ఇంట్లో వంట, పిల్లల సంరక్షణ, ఆర్థిక అంశాలను పంచుకున్నట్లే ఎవరు ఏం పని చేయాలనేది క్లారిటీ ఉండాలన్నారు. ఇక విజయవంతమైన వైవాహిక జీవితం కావాలంటే భార్యా భర్తలిద్దరూ సంపాదించినా దానిని ఒక్కటిగా చేసి ఆర్థిక ప్రణాళికలు రచించాలని చెప్పారు. పెళ్లి చేసుకుని ఒక్కటైనాక కూడా విడివిడిగా బిల్లులు స్పిట్ చేయటం మంచి అలవాటు కాదని దానిని మార్చుకోవాలన్నారు. పెద్ద నగరాల్లో నివసిస్తున్న సంపన్న వర్గాల్లోని భార్యా భర్తల ప్రవర్తనలకు కపూర్ పోస్ట్ అద్దం పడుతోంది.