హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట.. బెయిల్ పిటిషన్​ తీర్పు మే 31కి వాయిదా

హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట..  బెయిల్ పిటిషన్​ తీర్పు  మే 31కి వాయిదా

తెలంగాణ హైకోర్టులో  ఎంపీ అవినాష్​ రెడ్డికి ఊరట లభించింది. ఎంపీ అవినాష్​ రెడ్డి బెయిల్​ పిటిషన్​పై వాదనలు ముగిశాయి.   తీర్పును బుధవారానికి ( మే 31)వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు  అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐకు ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.   అవినాశ్​ రెడ్డి తల్లికి అనారోగ్యం కారణంగా అరెస్ట్​ చేయవద్దని హైకోర్టు తెలిపింది. 

వాడీ వేడిగా వాదనలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్‌ కోసం  కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన  పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో  వాడీవేడీగా వాదనలు జరిగాయి.  . అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించిన సీబీఐ తరపున న్యాయవాది.. అవినాష్‌రెడ్డి సీబీఐకి విచారణకు సహకరించడంలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అవినాష్‌రెడ్డి ఏదో సాకు చూపి తప్పించుకున్నాడని తెలిపారు.. ఇక, వైఎస్‌ వివేకా హత్యకు నెలరోజుల ముందే కుట్ర జరిగిందన్న సీబీఐ లాయర్‌.. వివేకా హత్య వెనుక రాజకీయ కారణం ఉందని వాదించారు..

తీర్పుబుధవారానికి వాయిదా

లోకసభ అభ్యర్థిగా వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అనధికారికంగా ముందే ప్రకటించారని స్టేట్‌మెంట్‌ చెబుతుంది కదా? అని సీబీఐ లాయర్‌ను ప్రశ్నించింది హైకోర్టు.. అవినాష్ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించినట్టు స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా? అన్న కోర్టు.. రాజకీయంగా అవినాష్‌రెడ్డి బలవంతుడు అని మీరే అంటున్నారు.. అలా అయితే వివేకాను చంపాల్సిన అవసరం ఏముందని సీబీఐని ప్రశ్నించింది.. మరోవైపు.. వైఎస్‌ భాస్కర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు?.. వాళ్ల నుండి ఏమైనా సమాచారం రాబట్టారా? అని కూడా సీబీఐని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు.. అయితే, వాళ్లు విచారణకు సహకరించలేదని కోర్టుకు విన్నవించింది సీబీఐ.. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... తీర్పును బుధవారం ( మే 31)నికి వాయిదా వేశారు.  అప్పటి వరకు ఎంపీ అవినాష్​ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.