హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్

హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్

మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఏప్రిల్ 17 సోమవారం రోజున తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ బెంచ్ లో లంచ్  మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం 02 గంటలకు విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 03 గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపింది.   గతంలోనాలుగుసార్లు అవినాష్ రెడ్డిని సైతం సీబీఐ విచారించింది. జనవరి 28 , ఫిబ్రవరి 24, మార్చ్ 10, మార్చ్ 14 తేదీల్లో అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ ఏప్రిల్ 17న మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. 

దీంతో అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. అవినాష్‌ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు, కేడర్ కూడా బయల్దేరారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరవుతున్నారు. సీబీఐ గతంలో మాదిరిగానే అవినాష్ విచారణ సమయంలో వీడియోలు, ఆడియో‌లు రికార్డ్ చేయనున్నారు.  

పులివెందులలో వైఎస్‌ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి ఆయనను అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.. వైద్య పరీక్షల తర్వాత సీబీఐ జడ్జి నివాసంలో ప్రవేశపెట్టగా 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. అక్కడి నుంచి భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ నెల 30లోపు వివేకా హత్య కేసును పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ కేసులో ఏం జరగబోతుందోఅన్నది ఆసక్తిగా మారింది.