ఈ సీజన్​లో ఇవి తినొద్దు

ఈ సీజన్​లో ఇవి తినొద్దు

జోరు వానలో.. వేడి వేడి పకోడి, ఘాటు బజ్జీ,  బోండాలు.. నోట్లో నీళ్లూరిస్తాయి. కానీ, అలా మనసు కోరిందల్లా తింటే.. శరీరం జీర్ణించుకోలేదు. పైగా ఈ కాలం కొన్ని కూరగాయలపై బ్యాక్టీరియా, కొన్ని రకాల కెమికల్స్​ తిష్ట వేస్తాయి. అవి తింటే తిప్పలు తప్పవు.  అందుకే ఈ సీజన్​లో కాస్త దూరం పెట్టాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. 

 వానాకాలం చేపలు, రొయ్యలు లాంటి సీ ఫుడ్​కి వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే.. ఈ కాలం నీళ్లలో వ్యాధికారకాలు, బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి.  అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల చేపలకి ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవి తినడం వల్ల మనమూ ఎఫెక్ట్​ అవుతాం. పైగా ఈ సీజన్​లో చేపల్లో పునరుత్పత్తి ఎక్కువగా జరుగుతుంటుంది. అది కూడా ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. 
 
పకోడి, కచోరి, సమోసా.. లాంటివి ఈ కాలంలో అస్సలు తినకూడదని కాదు. అలాగని, నచ్చినంత తింటామంటే కుదరదు. వీటిల్లోని నూనె.. కడుపునొప్పికి దారితీస్తుంది. జీర్ణ సమస్యలు, డయేరియా ఇబ్బంది పెడతాయి. అందుకే ఈ కాలం ఫ్రైడ్​ ఫుడ్స్​ని మోతాదులోనే తినాలి. అది కూడా వారం, పదిరోజులకి ఒకసారి తినాలి. అలాగే కొన్నిసార్లు వర్షం పడేముందు, పడ్డాక బాగా ఉక్కపోస్తుంటుంది. అలాంటప్పుడు రిలాక్సేషన్​ కోసం కార్బోహైడ్రేట్స్​తో నిండిన కూల్​డ్రింక్స్​ తాగకూడదు..  ఇవి కూడా కడుపులో ఇబ్బందికి కారణం అవుతాయి. 
 
తడి నేలలో పుట్ట గొడుగులు పెరుగుతాయి. పైగా ఇవి భూమికి చాలా దగ్గరగా ఉంటాయి. దాంతో వర్షం కురిసినప్పుడు వాటిపై మురికి నీరు, దాని ద్వారా బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. అందుకే ఈ కాలం ఇన్​డోర్​లో​ సాగు చేసిన మష్రూమ్స్​ని మాత్రమే తినాలి. అలాగే కూరగాయలు, ఆకుకూరలపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని పచ్చిగా తినకూడదు.
 
కీటకాలు, పురుగు మందుల నుంచి వంకాయ తనని తాను కాపాడుకోవడానికి  ఆల్కలాయిడ్స్​ అనే కెమికల్స్​ని​ ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే వానాకాలం వంగ చెట్లపై కీటకాలు ఎక్కువగా దాడి చేస్తాయి. దాంతో పెస్టిసైడ్స్​ మోతాదుకి మించి కొడుతుంటారు. అవి తినడం వల్ల చర్మంపై దద్దుర్లు,  గీతలు రావచ్చు. వికారం లాంటి సమస్యలు రావచ్చు. అందుకే ఈ కాలం వాటిని కాస్త పక్కనపెట్టాలి. 
 
రోటి, నిల్వ పచ్చళ్లు, చింత పండుతో చేసిన పులుసులు ఈ కాలం ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. చల్లటి వాతావరణం వల్ల ఈ కాలం అసలే నీళ్లు తాగాలనిపించదు. దానికి తోడు ఒంట్లోని నీటి శాతం కూడా తగ్గితే.. గొంతు సమస్యలొస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది.