న్యూఢిల్లీ/ హైదరాబాద్, వెలుగు: ప్రతి ఏడాది కేంద్రం అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణకు 16 పురస్కారాలు వరించాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష పాపులేషన్ కేటగిరీలో సిరిసిల్ల మున్సిపాలిటీకి మూడోసారి అవార్డు దక్కింది. 2019, 2021లో క్లీనెస్ట్ సిటీగా అవార్డు దక్కగా, ప్రస్తుతం ‘బెస్ట్ సెల్ఫ్ సస్టెయినబిలిటీ సిటీ’గా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. వేములవాడ, ఆదిబట్ల, బడంగ్ పేట్, భూత్పూర్, చండూర్, చిట్యాల, గజ్వేల్, ఘట్ కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరేడుచర్ల, సికింద్రాబాద్, తుర్కయాంజల్ మున్సిపాలిటీలు వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నాయి.
హుస్నాబాద్, ఘట్కేసర్ మున్సిపాలిటీలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్లకు రెండోసారి పురస్కారాలు దక్కాయి. శనివారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్- 2.0 (ఎస్ బీఎం) అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 12 క్లీనెస్ట్ స్టేట్స్, సిటీలకు పురస్కారాలు అందించారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో కలిసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పురస్కారాలందుకున్నారు. అవార్డులందుకున్న మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో 4న హైదరాబాద్ లో అభినందన సమావేశం నిర్వహించనున్నారు.
కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నరు: కేటీఆర్
స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. ఒక్క ఏరియాలో జరిగిన పనులను పూర్తి పథకానికి ఆపాదిస్తున్నారని, ఆయన లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన పనులపై ఆయనకే అవగాహన లేదన్నారు. ఈ స్కీంకు రూ.209 కోట్లు కేటాయించి కేవలం రూ.16 కోట్లు మాత్రమే విడుదల చేశారని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారని, అందులో నిజం లేదన్నారు. జీహెచ్‌ఎంసీ ఇప్పటికే నాలా అభివృద్ధి పనులకు రూ.103 కోట్లకు పైగా బిల్లులు చెల్లించిందని, ఇంకో రూ.150 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎస్ఎన్డీపీ కింద రూ.985 కోట్లతో వరద నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. ఇందులో రూ.450 కోట్ల విలువైన పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. కాగా, రాష్ట్రంలోని 95శాతం మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశామని మంత్రి కేటీఆర్ ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాటికి వంద శాతం పూర్తి చేస్తామన్నారు.
