వీడిన సస్పెన్స్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‎గా అక్షర్ పటేల్

వీడిన సస్పెన్స్: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‎గా అక్షర్ పటేల్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు తమ జట్టు సారథి పేరును ఢిల్లీ ఫ్రాంచైజ్ శుక్రవారం (మార్చి 14) అఫిషియల్‎గా ప్రకటించింది. టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‎ను ఢిల్లీ కెప్టెన్‎గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఐపీఎల్‎లో అక్షర్ పటేల్ ఢిల్లీని నడిపించనున్నట్లు తెలిపింది. ఢిల్లీ ప్రకటనతో అన్ని జట్ల కెప్టెన్లు ఎవరనేది తేలిపోయింది. ఇప్పటికే ఐపీఎల్ లోని అన్ని జట్లు తమ సారథుల పేర్లు ప్రకటించగా.. తాజాగా ఢిల్లీ కూడా కెప్టెన్ నేమ్ అనౌన్స్ చేసింది. ఇక..  ఢిల్లీ కెప్టెన్ రేసులో ప్రధానంగా కేఎల్ రాహుల్, అక్షర్ పోటీలో ఉన్నారు. కేఎల్ రాహుల్ సీనియర్ కావడంతో పాటు ఐపీఎల్‎లో సారథిగా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. 

ఈ నేపథ్యంలో ఢిల్లీ  కెప్టెన్సీ పగ్గాలను రాహుల్‎కు అప్పగిస్తారని క్రీడా వర్గా్ల్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఢిల్లీ యజమాన్యం అక్షర్ పటేల్ వైపు మొగ్గు చూపింది. అయితే.. కెప్టెన్సీ బాధ్యతలు రాహుల్ తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేయడంతోనే అక్షర్‎ను సారథిగా ఎంపిక చేసినట్లు టాక్. అక్షర్‎కు పెద్దగా కెప్టెన్‎గా పని చేసిన అనుభవం లేకున్నప్పటికీ.. గత కొంత కాలంగా ఇండియా తరుఫున నిలకడగా రాణిస్తుండటంతో డీసీ అక్షర్‎పై నమ్మకం ఉంచింది. గత సీజన్ లో అక్షర్ బౌలింగ్‎లో 11 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‎లో 131.28 స్ట్రైక్ రేట్‌తో 235 పరుగులు చేశాడు. 

31 ఏళ్ల అక్షర్ పటేల్ 2019 నుంచి ఐపీఎల్‎లో ఢిల్లీ తరుఫున ఆడుతున్నాడు. 2025 సీజన్ కోసం ఢిల్లీ అక్షర్ పటేల్‎ను రిటైన్ చేసుకుంది. రూ.16.50 కోట్లకు అక్షర్‏ను అట్టిపెట్టుకుంది డీసీ. ఢిల్లీ రిటైన్ చేసుకున్న ప్లేయర్లలో అక్షర్ పటేలే హెయ్యస్ట్ పెయిడ్. గత సీజన్లో ఢిల్లీ కెప్టెన్ గా బాధ్యతలను టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ చూసుకున్నాడు. ఈ సీజన్ కు పంత్ ఢిల్లీతో బంధాలు తెంచుకుని వేలంలో పాల్గొనగా.. లక్నో రిషబ్ ను దక్కించుకుంది. దీంతో ఢిల్లీకి కొత్త కెప్టెన్ అనివార్యమయ్యాడు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ ను సారథిగా నియమించింది. అయితే.. ఢిల్లీలో ఫాఫ్ డుప్లెసిస్, మిచెల్ స్టార్క్ వంటి అనుభవజ్ఞులు ఉన్నప్పటికీ.. డీసీ ఫ్రాంచైజ్ మాత్రం అక్షర్ వైపు మొగ్గు చూపింది. 

ఢిల్లీ కెప్టెన్ గా ఎంపిక కావడంపై అక్షర్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నాపై నమ్మకం ఉంచిన మా యజమానులు, సహాయక సిబ్బందికి నేను చాలా కృతజ్ఞుడను. ఢిల్లీలో ప్లేయర్‎గా మొదలైన నా ప్రస్థానం కెప్టెన్ వరకు చేరింది. ఈ జట్టును ముందుకు నడిపించడానికి నేను సిద్ధంగా,  నమ్మకంగా ఉన్నా. ప్రస్తుత ఢిల్లీ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. మా టీమ్‎లో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు. ఇది నాకు సహయ పడుతోంది. ఈ సీజన్ కోసం జట్టులో చేరడానికి నేను వేచి ఉండలేను’’ అని పేర్కొన్నాడు.