అయోధ్య కేసులో ముస్లిం పార్టీల యూటర్న్

అయోధ్య కేసులో ముస్లిం పార్టీల యూటర్న్

న్యూఢిల్లీ:  అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)-2003 రిపోర్ట్ ను ప్రశ్నించిన ముస్లిం పార్టీలు యూటర్న్ తీసుకున్నాయి. ఏఎస్ఐ రిపోర్టును ప్రశ్నించబోమని, సమయాన్ని వృథా చేసినందుకు సుప్రీంకోర్టుకు సారీ చెప్పాయి. గురువారం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని  ఐదుగురు జడ్జీల కాన్‌‌స్టిట్యూషన్ బెంచ్ ఎదుట ముస్లిం పార్టీల తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ ఈ విషయాన్ని తెలిపారు. ఏఎస్ఐ రిపోర్ట్ లో ప్రతి పేజీని ఎవరు రాశారో స్పష్టంగా ఉందని,  అయితే సారాంశంలో మాత్రం లేదని ముస్లింల తరపున హాజరైన మరో సీనియర్ అడ్వకేట్ మీనాక్షి అరోరా బెంచ్ కు చెప్పారు. వాదనలు ముగించేందుకు టైమ్ ఫ్రేమ్ స్పష్టం చేయాలని హిందూ, ముస్లిం పార్టీలను జస్టిస్ గొగోయ్ సూచించారు. అక్టోబర్‌‌‌‌ 18 నాటికి విచారణ పూర్తి చేయాల్సిందేనని, గడువును ఒక్కరోజు కూడా పెంచేదిలేదన్నారు. తీర్పు చెప్పడానికి నాలుగు వారాల టైమ్‌‌‌‌ మాత్రమే ఉంటుందని, ఇది అద్భుతమేనని సీజే చెప్పారు. నవంబర్‌‌‌‌ 17 నాటికి జస్టిస్ గొగోయ్‌‌‌‌ పదవీకాలం ముగియనుంది.  ఆలోపే కీలకమైన అయోధ్య కేసు తీర్పు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.  అయోధ్య కేసు విచారణను అక్టోబర్‌‌‌‌ 18 నాటికి ముగించాలని సుప్రీంకోర్టు గత వారమే నిర్ణయించింది.