
శ్రీరాముడు పుట్టిన ప్లేస్ అయిన అయోధ్య దేశంలోని ఏడు హిందూ పవిత్ర ఆలయాలలో ఒకటి. అయోధ్యను సరయూ నది ఒడ్డున స్వయంగా దేవతలే సృష్టించారని నమ్ముతారు. తర్వాత ఈ నగరం శ్రీరాముడి పూర్వీకులైన సూర్యవంశ రాజుల రాజధానిగా మారిందని చెబుతారు. అయోధ్యను దేవతల సమక్షంలో మనువు నిర్మించాడని రామాయణంలో కూడా పేర్కొన్నారు. ఈ నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా (90 చదరపు మైళ్ళు ) చెప్పారు. అయోధ్య గురించిన విశేషాలు అధర్వణ వేదంలోనూ ఉన్నాయని చెప్తారు. కోసల రాజ్యానికి తొలి రాజధాని అయోధ్య. ఈ నగరాన్ని రాజధానిగా చేసుకునే ఇక్ష్వాకుడు, పృథు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, రఘు, దిలీపుడు, దశరథుడు, రాముడు వంటి ప్రఖ్యాత చక్రవర్తులు పాలించారు.
అయోధ్య పేరు ఇలా వచ్చింది..
మహారాజు ఆయుధ్ పురాణాలలో శ్రీరాముని పూర్వీకుడని పేర్కొన్నారు. అతడి పేరు యుద్ధ్ అనే పదం నుండి వచ్చింది. ఆయుధ్ అంటే అపరాజితుడు అని అర్దం. ఆయన పేరు మీదే ఈ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని భావిస్తారు. క్రీ.శ. మొదటి శతాబ్దంలో అయోధ్యను సాకేతపురం అని పిలిచేవారు. క్రీ.శ. 127లో సాకేతపురాన్ని కుషన్ చక్రవర్తి జయించాడు. మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలనలోఈ నగరం అయోధ్య, అజోధియ అని పిలువబడింది. అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతాలైన ఆగ్రా-అయుధ్ ప్రాంతాలలో భాగంగా ఉండేది.
సప్తపురాలలో మొదటిది..
హిందువులకు అతి పవిత్రమైన, మోక్షాన్ని ప్రసాదించే ఏడు హోలీ సిటీస్ లో.. రామజన్మభూమి అయిన అయోధ్యనే మొదటిదని హిందువులు భావిస్తారు.
జైనులకూ ముఖ్య ప్రదేశం..
జైన మతస్థులకు కూడా అయోధ్య ముఖ్యమైన నగరమే. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్దంకరులిద్దరికి అయోధ్య జన్మస్థలం. మొత్తంగా ఐదుగురు తీర్దంకరులు ఇక్కడే జన్మించారు.
బౌద్ధ మతంతోనూ లింకు..
అయోధ్య సిటీకి బౌద్ధమత వారసత్వం కూడా ఉంది. హిస్టారి యన్స్ దీనిని సాకేతపురంగా పేర్కొన్నారు. క్రీ.పూ 5వ శతాబ్దం నుండి క్రీ.శ 5వ శతాబ్దం వరకు బౌద్ధమత కేంద్రంగా అయోధ్య విలసిల్లింది. ఇక్కడ మౌర్యుల కాలంలో నిర్మించిన పలు బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు, శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. గుప్తులకాలంలో అయోధ్య వాణిజ్యంలో ముందంజలో ఉండేది. క్రీ.పూ. 600లలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. బుద్ధుడు ఈ నగరానికి పలు సార్లు వచ్చినట్లు చెప్తారు. ఇక్కడ బౌద్ధమఠాలు ఉన్నట్లు చైనా సన్యాసి ఫాక్సియన్ రాశాడు. అయోధ్యలో క్రీస్తుశకం 11, 12 శతాబ్దాల మధ్య కనౌజ్ సామ్రాజ్యం వెలిసింది. ఈ సిటీని ఔధ్, అవధ్ అని పిలిచారు. ఆ తర్వాత అయోధ్య ఢిల్లీ సుల్తానుల పాలనలోకి వెళ్లింది. 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. నవాబుల కాలంలోనూ ఇక్కడి ట్రెడిషన్స్ కొ నసాగాయి. హిందూ టూరిస్టులు పెద్దఎత్తున వచ్చేవారు.