అద్వానీ రథయాత్ర..అరెస్టుతో గుడి కథలో మలుపు

అద్వానీ రథయాత్ర..అరెస్టుతో గుడి కథలో మలుపు

సమస్తిపూర్, ముంబై, న్యూఢిల్లీఅయోధ్య వివాదంపై సుప్రీం వెలువరించిన తీర్పుతో బీజేపీ సీనియర్​ నేత ఎల్​కే అద్వానీని సంతోషంలో ముంచెత్తింది. సరిగ్గా ఆయన 92వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న తెల్లారే ఈ తీర్పు వెలువడింది. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం.. 1990 అక్టోబర్ 23న రథయాత్ర చేస్తున్న అద్వానీని బీహార్​లోని సమస్తిపూర్​లో లాలూ సర్కారు అడ్డుకుంది. నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. దేశ రాజకీయాలలో ఈ సంఘటన సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. బీజేపీకి పాపులారిటీని తెచ్చిపెట్టింది. దేశమంతటా ఆందోళనలకు కారణమైంది.

ఆ రోజు ఏంజరిగిందంటే..

‘తెల్లవారుజామునే సీఎం లాలూ ప్రసాద్​ యాదవ్​ నుంచి నాకు ఫోన్​ వచ్చింది. బాబా(అద్వానీ)ను పట్టుకున్నామని ఆయన చెప్పారు. బీజేపీ చీఫ్​ హోదాలో అద్వానీ చేపట్టిన రథయాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ యాత్రను ఆపేయాలని కేంద్రం ప్రయత్నించింది. చివరకు లాలూ నిర్ణయంతో బీహార్​ పోలీసులు అద్వానీని అరెస్టు చేశారు. హెలికాఫ్టర్​లో డుంకాలోని ఓ గెస్ట్ హౌజ్​కు తరలించారు’ అని అప్పటి  పీటీఐ పాట్న  బ్యూరో చీఫ్​ ఎస్​డీ నారాయణ  చెప్పారు. అద్వానీ అరెస్టు తర్వాత నార్త్​ ఇండియాలో పెద్ద ఎత్తున  నిరసన ప్రదర్శనలు జరిగాయి. కొన్నిచోట్ల మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అద్వానీ అరెస్టుకు నిరసనగా బీజేపీ మద్ధతు ఉపసంహరించుకోవడంతో వీపీ సింగ్​సర్కారు కూలిపోయింది. అక్టోబర్​ 30న వేలాది మంది కరసేవకులు అయోధ్యకు బయలుదేరారు. పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించడంతో కేవలం వెయ్యి మంది మాత్రమే అయోధ్యకు చేరుకున్నారు. మసీదులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన కరసేవకులపై యూపీ పోలీసులు ఫైరింగ్​ జరపడంతో 28 మంది చనిపోయారు. రెండేళ్ల తర్వాత 1992లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు వీహెచ్​పీ, బీజేపీ అయోధ్యలో కరసేవకుల ర్యాలీ ఏర్పాటు చేసింది. డిసెంబర్​ 6న జరిగిన ఈ ర్యాలీలో 1,50,000 మంది కరసేవకులు పాల్గొన్నారు. బాబ్రీ మసీదు ఏరియాలోకి చేరుకున్న  తర్వాత ర్యాలీ కంట్రోల్​ తప్పి, హింసాత్మకంగా మారింది. కరసేవకులు మసీదును కూల్చేశారు. ఈ కేసులో పోలీసులు అద్వానీ, మురళీ మనోహర్​ జోషి, ఉమాభారతి, వినయ్​ కతియార్​ సహా పలువురు నేతలపై చార్జిషీట్​ దాఖలు చేశారు.

అద్వానీని కలిసి థాంక్స్​చెప్తా: ఉద్ధవ్​ థాక్రే

బీజేపీ సీనియర్​ నేత అద్వానీని కలిసి థాంక్స్​చెప్తానని శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే శనివారం ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అద్వానీని అభినందించి వస్తానని చెప్పారు. ఇది దేశ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించాల్సిన రోజని థాక్రే అన్నారు.

సింఘాల్, అద్వానీలదే ఈ ఘనత: గోవిందాచార్య

వీహెచ్​పీ నేత అశోక్​ సింఘాల్, బీజేపీ సీనియర్​ లీడర్ అద్వానీ చేసిన పోరాటాలతో నే ఇప్పుడీ విజయం దక్కిందని ఆర్ఎస్ఎస్​ మాజీ లీడర్ కేఎన్​ గోవిందాచార్య పేర్కొన్నారు. రామ జన్మభూమి ఉద్యమంలో గోవిందాచార్య కీలక పాత్ర పోషించారు. కోర్టు తీర్పుతో చాలా సంతోషంగా ఉందని, మూడు నెలల్లో మందిర నిర్మాణ ప్లాన్​రూపొందించి కోర్టుకు సమర్పిస్తామని ఆయన చెప్పారు. రామ మందిరం నుంచి రామ రాజ్యం వైపు దేశాన్ని నడిపించాలని ఆయన ఆకాంక్షించారు.

అద్వానీకి పాదాభివందనం చేస్తా: ఉమా భారతి

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ లీడర్​ ఉమా భారతి చెప్పారు. మందిరం నిర్మాణానికి అడ్డంకులు తొలగడం వెనక అద్వానీ కృషి ఎంతో ఉందని ఆమె చెప్పారు. కోట్లాది భక్తుల ఆశలు నెరవేరేందుకు ఫైట్​ చేసిన అద్వానీకి పాదాభివందనం చేస్తానని ఆమె చెప్పారు. అశోక్​ సింఘాల్​కూడా ఈ ఫైట్​లో కీలకంగా వ్యవహరించారని ఉమా భారతి పేర్కొన్నారు.