
అయోధ్యపై 6 నుంచి ప్రతిరోజూ విచారణ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బాబ్రీ మసీద్– రామజన్మభూమి స్థలం వివాదాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించడంలో మధ్యవర్తుల కమిటీ ఫెయిలైనట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఇకపై ఈ అంశాన్ని కోర్టే చూసుకుంటుందని, ఈ నెల 6 నుంచి ప్రతిరోజు విచారణ కొనసాగుతుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ బెంచ్ స్పష్టం చేసింది. ముగ్గురు సభ్యుల మీడియేషన్ కమిటీ సమర్పించిన రిపోర్టును పరిశీలించిన తర్వాత సీజేఐ బెంచ్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ కేసులో వాదనలు పూర్తయ్యేదాకా రోజువారీ విచారణ కొనసాగుతుందన్న బెంచ్.. అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని రిజిస్ట్రార్‌ను, వాదనలకు సిద్ధంగా ఉండాలని మూడు పక్షాల లాయర్లను ఆదేశించింది. అయోధ్య కేసును విచారిస్తున్న బెంచ్‌లో సీజేఐ జస్టిస్ గొగోయ్‌తోపాటు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ ఉన్నారు.
నాలుగు నెలలపాటు ట్రై చేసినా..
అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్ని వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాకు సమానంగా పంచాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. వాటిని విచారిస్తూనే, కోర్టు బయట పరిష్కారం కోసం సుప్రీంకోర్టు మధ్యవర్తుల కమిటీని ఏర్పాటుచేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లా చైర్మన్‌గా, అధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, మధ్యవర్తిత్వంలో అనుభవమున్న సీనియర్ లాయర్ శ్రీరాం పంచు సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8న ఏర్పాటైన కమిటీకి మొదట ఎనిమిది వారాల గడువివ్వగా, మరింత టైమ్ కావాలని కోరడంతో ఆగస్టు 15వరకు కోర్టు గడువు పొడిగించింది. ఈ కమిటీ గురువారమే తన రిపోర్టును కోర్టుకు అందించింది. దాదాపు నాలుగున్నర నెలల పాటు ఈ కేసుతో సంబంధమున్న అన్ని పక్షాలతో కమిటీ మెంబర్లు విస్తృత చర్చలు జరిపినా, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని రాబట్టడంలో విఫలమైందని, ఇదే విషయాన్ని కమిటీ తన రిపోర్టులో పేర్కొందని బెంచ్ కామెంట్ చేసింది. నిజానికి సున్నీ వక్ఫ్ బోర్డు(ముస్లింల తరఫు పిటిషనర్) తప్ప మిగతా పిటిషనర్లైన ‘రాం లల్లా విరాజ్మాన్’, ‘నిర్మోహి అఖారా’లు మొదటి నుంచీ మీడియేషన్ ప్రక్రియను వ్యతిరేకించారు. కమిటీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ పిటిషన్ కూడా వేశారు. గత నెలలో దీన్ని విచారించిన కోర్టు, కమిటీ గడువును ఆగస్టు 15వరకు పొడిగిస్తూ, ‘ఒకవేళ మధ్యవర్తుల ప్రయత్నాలన్నీ ఫెయిలైతే, వివాదంపై రోజూవారీ విచారణ చేపడతాం’’అని క్లారిటీ ఇచ్చింది. గడువు కంటే ముందే కమిటీ రిపోర్టు అందడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఎలా డీల్ చెయ్యాలో మాకు తెలుసు: సీజేఐ బెంచ్
మీడియేషన్ విఫలమైనందున 6 నుంచి రోజువారీ విచారణ కొనసాగిస్తామంటూ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై ముస్లింల తరఫు లాయర్ రాజీవ్ ధవన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎన్నో చిక్కుముడులు, టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయని.. ఏ ఒక్క పాయింట్‌నూ వదలకుండా ప్రతి అంశాన్నీ విచారించాలని బెంచ్‌ను కోరారు. తాను పూర్తిస్థాయిలో వాదించడానికి కనీసం 20 రోజులైనా పడుతుందని, అంత టైమ్ తనకివ్వాల్సిందేనని పట్టుపట్టారు. అందుకు కోర్టు.. మేమేం చెయ్యాలో మీరు గుర్తుచేయాల్సిన అవసరం లేదంటూ ధవన్‌కు చురకలంటించింది. ‘‘ఈ కేసు ఎంత సున్నితమైందో, ఎన్ని భిన్నమైన అంశాలతో ముడిపడి ఉందో, దీన్ని ఎలా డీల్ చెయ్యాలో మాకు తెలుసు. ముందు రోజువారీ విచారణ మొదలుకానివ్వండి..” అని సీజేఐ బెంచ్కామెంట్ చేసింది.
ఏకాభిప్రాయం అసాధ్యం
అయోధ్య కేసులో రోజువారీ విచారణను స్వాగతిస్తున్నాం. మీడియేషన్ ఫెయిల్ కావడం నిజంగా దురదృష్టకరం. ఈ వివాదంలో మొదట ముగ్గురే లిటిగెంట్లుండేవాళ్లు. ఇప్పుడా సంఖ్య 25కు పెరిగింది. అందులో ఎనిమిది మంది ముస్లింలైతే, మిగతావాళ్లంతా హిందూ కమ్యూనిటీకి చెందినవాళ్లు. ఇంత మంది మధ్య ఏకాభిప్రాయం కుదరడం అసాధ్యం. – ఇక్బాల్ అన్సారీ, ముస్లింల తరఫు లాయర్
త్వరలో ఫైనల్ జడ్జిమెంట్
సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టిందంటే, అయోధ్య కేసును తేల్చేయాలని డిసైడైనట్లు నాకనిపిస్తోంది. ఆ లెక్కన త్వరలోనే ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందనుకుంటున్నా. స్థలం వివాదంలో ఉన్నప్పటికీ, అక్కడ పూజలు చేసుకునే హక్కు హిందువులకుందని నేను పిటిషన్ వేశాను. ఇన్నాళ్లూ ముస్లింలు కావాలనే విచారణను సాగదీస్తూ వచ్చారు. – సుబ్రమణ్య స్వామి, బీజేపీ ఎంపీ