ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు.. అయోధ్యలో హై అలర్ట్‌

ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు.. అయోధ్యలో హై అలర్ట్‌

అయోధ్య: ఆగస్టు 5 రామమందిరం నిర్మాణ భూమి పూజను అడ్డుకునేందుకు ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని అయోధ్యలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐకి చెందిన లష్కరే, జైషే మహ్మద్‌ టెర్రరిస్టులు ఈ దాడులకు పాల్పడతారని సమాచారం రావడంతో భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. దాడులు చేయాలని టెర్రర్‌‌ గ్రూప్‌ చీఫ్‌లకు ఐఎస్ఐ ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, అయోధ్య, జమ్మూకాశ్మీర్‌‌లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జమ్మూకాశ్మీర్‌‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఆగస్టు 5కి ఏడాది కావడం, అయోధ్యలో శంకుస్థాపన చేయడం ఒకేరోజు కావడంతో దాడులు జరిగే అవకాశం ఉందని, భద్రతా బలగాలు సెక్యూరిటీ పెంచారని అధికారులు చెప్పారు. అయోధ్యలోని రామమందిరంలో ఆగస్టు 5న మందిరం శంకుస్థాపన జరగనుంది. వీఐపీలు వస్తున్న నేపథ్యంలో హెలికాప్టర్‌‌ దిగే సాకేత్‌ మహా విద్యాలయం నుంచి రామ జన్మభూమి స్థలం వరకు ఇప్పటికే భద్రతా దళాలు మోహరించారు. రామ్‌కోట్‌ ప్రాంత నివాసితుల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక పాస్‌లను జారీ చేశారు. అలానే రోజూ భద్రతా బలగాలు మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించడంతో పాటు తనిఖీలు చేపడుతున్నారు. డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆయనతో పాటు బీజేపీ సీనియర్‌‌ నేతలు ఎల్‌కే అడ్వానీ, మురళీమనోహర్‌‌ జోషి, ఉమాభారతి, ఆర్‌‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరలు హాజరు కానున్నారు. కరోనా నేపథ్యంలో కేవలం 200 మందితో మాత్రమే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తులంతా ఇళ్లలో ప్రత్యక్ష ప్రసారం వీక్షించాలని రామమందిరం నిర్మాణ ట్రస్ట్‌ కోరింది.