2024 జనవరిలో ఆయోధ్య రామయ్య దర్శనం

2024 జనవరిలో ఆయోధ్య  రామయ్య దర్శనం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య  రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  ఆలయ నిర్మాణానికి సంబంధించిన  45 శాతం పనులు పూర్తయ్యాయి. 2023 చివరినాటికి పనులు పూర్తి చేసి...2024  జనవరి నాటికి భక్తులు  శ్రీరాముడిని దర్శించుకునే లక్ష్యంగా  శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పనిచేస్తోంది. ఇప్పటికే ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ పనులు సగం దశకు వచ్చాయని ఆలయ డిజైనర్ కన్రస్ట్రక్షన్ మేనేజర్ జి. సహస్రబోజని తెలిపారు.  2024లో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే నాటికి ఆలయంలో  శ్రీరాముడి విగ్రహాన్ని  ప్రతిష్ఠిస్తామన్నారు. భక్తుల దర్శనార్థం జనవరి 2024లో రామమందిరాన్ని ప్రారంభిస్తామన్నారు.  ఆగస్టు నాటికి గర్భగుడి కింది అంతస్తు పనులు కూడా పూర్తవుతాయని వెల్లడించారు. 

ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ..2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత  2020 ఆగస్టు 5న రామ మందిరం నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. వేద మంత్రాల మధ్య ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు.  గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకలను స్థాపించారు. మూడు అంతస్తుల్లో, ఐదు మండపాలుగా నిర్మితమవుతున్న  రామాలయానికి  రూ.1800 కోట్లు ఖర్చవుతుందని  శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర  ట్రస్టు సభ్యులు వెల్లడించారు. అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్‌ ఆర్కిటెక్ట్స్‌ సోమ్‌పురా ఫ్యామిలీ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది. 


2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయం నిర్మితమవుతోంది. మందిరం పొడవు 380 అడుగులు కాగా..వెడల్పు 250 అడుగులు. మూడు అంతస్తుల్లో నిర్మించనున్న మందిరం 161 అడుగుల ఎత్తులో ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.