7 వేల మందికి ఆహ్వానం.. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు

7 వేల మందికి ఆహ్వానం.. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు
  • ఇన్విటేషన్ కార్డుపై గుడి, బాల రాముడి బొమ్మ
  •  రామ జన్మభూమి ఉద్యమంపై స్పెషల్ బుక్ లెట్ విడుదల

అయోధ్య(యూపీ) : అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 7 వేల మంది గెస్ట్​లను ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ కార్డులు పంపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు యూపీ గవర్నర్, సీఎం, సాధువులు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఇన్విటేషన్ సెట్ లో మెయిన్ ఇన్విటేషన్ కార్డు, ప్రాణ ప్రతిష్ఠ కార్డు, రామ జన్మభూమి ఉద్యమ బుక్​లెట్ ఉన్నాయి. ఇన్విటేషన్ కార్డులను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందించారు. మెయిన్ ఇన్విటేషన్ కార్డుపై రాముడి గుడి బొమ్మను, తేజస్సు ఉట్టిపడుతున్న బాల రాముడి బొమ్మను ముద్రించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్డుపై జనవరి 22, 2024, సోమవారం రోజున మధ్యాహ్నం 12.20 గంటలకు సుముహూర్తం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక రామ జన్మభూమి ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న కీలక వ్యక్తుల వివరాలను బుక్ లెట్​లో పొందుపర్చారు. వీరిలో దేవరహా బాబాజీ మహరాజ్, మహంత్ అభిరామ్ దాస్, పరమహంస రామచంద్ర దాస్, కేకే నాయర్ (అప్పటి జిల్లా కలెక్టర్), ఠాకూర్ గురుతద్ సింగ్, రాజేంద్ర సింగ్ (రజ్జూ భయ్యా), అశోక్ సింఘాల్, తదితరులు ఉన్నారు.

ఆహ్వానితులు వీళ్లే..

రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోదీ, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి, ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్​లతోపాటు సచిన్, కోహ్లీ, అమితాబ్ బచ్చన్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలకు ట్రస్టు ఆహ్వానం పంపింది. రామాయణం సీరియల్​లో రాముడు, సీత పాత్రలు పోషించిన అరుణ్ గోవిల్, దీపికా చిఖిలాను కూడా ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 4 వేల మంది సాధువులకూ ఇన్విటేషన్లు వెళ్తున్నాయి. గోద్రా రైలు దహనం ఘటనలో మృతిచెందిన 50 మంది కరసేవకుల కుటుంబాలనూ ట్రస్టు ఆహ్వానించింది.

నగర సంప్రదాయ శైలిలో..

అయోధ్య రామమందిరాన్ని నగర సంప్రదాయ శైలిలో నిర్మిస్తున్నారు. 380 అడుగులు పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో 3 అంతస్తులుగా ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. ఆలయానికి 392 స్తంభాలు, 44 గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్‌తోపాటు ప్రధాన ఆలయం గర్భగుడిలో బాల రాముడి విగ్రహం ఉంటుంది. ఆలయంలో రంగమండపం, నృత్యం, సభా మండపం, ప్రార్థన, కీర్తనా మండపాలుంటాయి. నాలుగు మూలల సూర్య భగవానుడు, భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తర భుజంలో అన్నపూర్ణ అమ్మవారి ఆలయం.. దక్షిణ భుజంలో హనుమంతుడి గుడిఉంటుంది. కాగా, ఆలయం నిర్మాణంలో ఎక్కడా ఇనుము ఉపయోగించకపోవడం విశేషం.