జై శ్రీరాం : ఆ రోజు మందు కాదు.. పానకం తాగుదాం : అసోంలోనూ డ్రై డే

జై శ్రీరాం : ఆ రోజు మందు కాదు.. పానకం తాగుదాం : అసోంలోనూ డ్రై డే

హిందువులు ఎంతగానో ఎదురుచూస్తున్న అయోధ్యలోని రామమందిర విగ్రహ  ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న  జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమానికి అతిధులతో పాటుగా లక్షాలాది భక్తులు హాజరుకానున్నారు.  ఈ క్రమంలో అసోం ప్రభుత్వం కీలక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   జనవరి 22ని 'డ్రై ​​డే'గా ప్రకటించింది.   గౌహతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న పలు కీలక తీర్మానాల్లో ఈ నిర్ణయం కూడా ఉంది.  రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22న డ్రై డేగా ప్రకటించాలని అస్సాం కేబినెట్ నిర్ణయించిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్ లో ప్రకటించారు.  అంటే ఆరోజు రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరగవు అన్నమాట.  

శ్రీరాముడి పండుగ అంటే పానకం... వడపప్పు కచ్చితంగా ఉండాలని.. వాటినే ప్రసాదంగా స్వీకరిస్తారు.  మనవారు సంతోషం వచ్చినా... దు:ఖం వచ్చినా... వైన్​ షాపులకు క్యూ కడతారు. జనవరి 22న శ్రీరామ జన్మభూమిలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పే సమయం... ఆరోజు పెద్ద పండుగే.  అందుకే ఆరోజునైనా కనీసం మందు మానేసి జైశ్రీరాం అంటూ.. పానకం... వడపప్పు తీసుకోవాలని అసోం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. .ఇక ఇప్పటికే ఆ రోజున చత్తీస్‌గఢ్‌లో డ్రై డే అమలవుతుందని ఆ రాష్ట్ర సీఎం విష్ణు దేవ్ సాయి ప్రకటించారు. 

వారం ముందు నుంచే పూజలు..  

శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రధాన కార్యక్రమానికి వారం రోజులు ముందుగా జనవరి16వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్  ఆధ్వర్యంలో 22న రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ నెల 14 నుంచి 22 వరకూ అమృత్ మహోత్సవ్ పేరిట రోజూ ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు. ఇక వేడుకలకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి భోజనం, వసతితో పాటు అవసరమైన సౌలతులు కల్పిస్తున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 15 వేల మంది బస చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

ఈ వేడుకలను దేశమంతటా లైవ్ టెలికాస్ట్ చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. పట్టణాలు, పల్లెల్లో బూత్ లెవెల్​లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి వేడుకలను లైవ్​లో ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. వేడుకలు జరిగే రోజున అయోధ్యకు అందరూ వచ్చే అవకాశంలేనందున ప్రతి సామాన్యుడు ఉన్న చోటి నుంచే వేడుకలను వీక్షిస్తూ, బాల రాముడిని దర్శించుకునేలా చూడాలని పార్టీ భావిస్తోంది.