జనవరి 20-25 వరకు ముస్లింలు ఇళ్లలోనే ఉండాలి : బద్రుద్దీన్ అజ్మల్

జనవరి 20-25 వరకు ముస్లింలు ఇళ్లలోనే ఉండాలి : బద్రుద్దీన్ అజ్మల్

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ కీలక ప్రకటన చేశారు. ముస్లింలందరూ జనవరి 20 నుండి 25వరకు తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని సమాజానికి అతిపెద్ద శత్రువు అని కూడా ఆయన పేర్కొన్నాడు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నెలాఖరులో అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనున్న సందర్భంగా ముస్లింలు ప్రయాణానికి దూరంగా ఉండాలని బద్రుద్దీన్ అజ్మల్ కోరారు.

మనం జాగ్రత్తగా ఉండాలని, జనవరి 20 - 25 వరకు ముస్లింలు ఈ ప్రయాణానికి దూరంగా ఉండాలని అజ్మల్ చెప్పారు. రామజన్మభూమిలో రామ్ లల్లా విగ్రహాన్ని ఉంచడం ప్రపంచం మొత్తం చూస్తుందన్న ఆయన.. లక్షల మంది ప్రజలు బస్సులు, రైళ్లు, విమానాలు మొదలైన వాటిలో ప్రయాణిస్తారని.. శాంతిని కాపాడాలని అజ్మల్ అస్సాంలోని బార్పేటలో ఒక సభలో ప్రసంగిస్తూ అన్నారు. ముస్లింలకు బీజేపీ అతి పెద్ద శత్రువు అని అభివర్ణించారు. తమ జీవితాలకు, విశ్వాసానికి, మసీదులకు, ఇస్లామిక్ చట్టాలకు శత్రువన్నారు. అయోధ్యలో మసీదు కూల్చివేత ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఆ ఉద్దేశంతోనే తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నాని తెలిపారు.

అజ్మల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. బీజేపీ ముస్లింలను ద్వేషించదని చెబుతున్నారు. 'సబ్కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్' అనే మంత్రంతో తాము పని చేస్తున్నామని అంటున్నారు. బద్రుద్దీన్ అజ్మల్, ఓవైసీ వంటి వ్యక్తులు సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తారని, బీజేపీ అన్ని మతాలనూ గౌరవిస్తుందని వాదిస్తున్నారు.