ఒకరు పది పాస్​..మరొకరు ఫెయిల్ అయినా డాక్టర్లయిన్రు!

ఒకరు పది పాస్​..మరొకరు ఫెయిల్ అయినా డాక్టర్లయిన్రు!

హనుమకొండ, వెలుగు: వాళ్లిద్దరూ ఫ్రెండ్స్​..ఒకరు పది పాస్​ అయితే మరొకరు ఫెయిలయ్యారు. అయితేనేం నకిలీ సర్టిఫికెట్లతో ఆయుర్వేద డాక్టర్ల అవతారం ఎత్తి  25 ఏండ్లుగా లక్షల మందికి ట్రీట్​మెంట్ ఇస్తూ లక్షలు సంపాదించారు. ఎట్టకేలకు టాస్క్​ ఫోర్స్​ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. వివరాలను వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి మంగళవారం తెలియజేశారు. హంటర్​ రోడ్డుకు చెందిన ఇమ్మడి కుమార్, వరంగల్ చార్ బౌళి ఏరియాకు చెందిన మహ్మద్​ రఫీ  ఫ్రెండ్స్. కుమార్​ పది పాస్​ కాగా.. రఫీ ఫెయిలయ్యాడు. ఇద్దరూ 1997 కంటే ముందు వరంగల్ లోని ప్రముఖ డాక్టర్ల వద్ద కంపౌండర్లుగా పని చేశారు. ఆ నాలెడ్జ్ తో హాస్పిటల్​తెరవాలనుకున్నారు.  

రూ.5 వేలకే డాక్టర్​ డిగ్రీ పట్టా

కుమార్, రఫీ ఇద్దరూ డాక్టర్లు కావాలని ఫిక్సయ్యాక బీహార్​లోని దేవ్​ఘర్​ విద్యాపీఠ్ ​యూనివర్సిటీ నుంచి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్టు నకిలీ సర్టిఫికెట్లు సంపాదించారు. వీటికి కేవలం రూ. 5 వేలు మాత్రమే ఖర్చు చేశారు. ఇమ్మడి కుమార్.. ​క్రాంతి క్లినిక్​ పేరుతో కొత్తవాడలో..రఫీ చార్​ బౌళి ప్రాంతంలోనే సలీమా క్లినిక్​ను స్టార్ట్​ చేశారు. ఇలా 25 ఏండ్ల నుంచి డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ఒక్కొక్కరు రోజుకు 30 నుంచి 40 మంది పేషెంట్లను చూసేవారు. టెస్టుల కోసం ల్యాబ్​లు, మందుల కోసం మెడికల్​షాపులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికి ట్రీట్​మెంట్​ఇచ్చారు. రోగి వ్యాధి ముదిరితే పెద్ద దవాఖానాలకు రిఫర్​ చేసేవారు. ఈ క్రమంలో వరంగల్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులకు విషయం తెలియడంతో మట్వాడా, ఇంతేజార్​గంజ్​ పోలీసులు, వరంగల్ రీజినల్​ఆయుష్​ విభాగానికి చెందిన డాక్టర్లతో కలిసి రెండు క్లినిక్​లలో తనిఖీలు చేశారు. వీరివి నకిలీ సర్టిఫికేట్లని తేలగా.. అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిజాన్ని ఒప్పుకున్నారు. రెండు ఫేక్​ డిగ్రీ సర్టిఫికెట్లు, రూ.1.28 లక్షలనగదు, వైద్య పరికరాలు, మెడిసిన్స్​ స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్​ ఫోర్స్​ అడిషనల్​ డీసీపీ వైభవ్​ గైక్వాడ్​, ఏసీపీ జితేందర్​రెడ్డి, ఆయుష్​ రీజినల్ ​డిప్యూటీ డైరెక్టర్​ రవినాయక్​, టాస్క్​ ఫోర్స్ సీఐలు నరేశ్​కుమార్,​ వేంకటేశ్వర్లు, ఎస్సైలు లవన్​ కుమార్​, శ్రీకాంత్​, ఏఏవో సల్మాన్​ పాషా లను సీపీ అభినందించారు.