
హాంకాంగ్: ఇండియా రైజింగ్ షట్లర్ ఆయుష్ షెట్టి.. హాంకాంగ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో సంచలన విజయం సాధించాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ ఆయుష్ 21–19, 12–21, 21–14తో వరల్డ్ రెండో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. 72 నిమిషాల మ్యాచ్‌లో 20 ఏళ్ల ఆయుష్ దూకుడుగా ఆడాడు. కోర్టులో పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. తొలి రెండు గేమ్‌ల్లో గట్టి పోటీ ఎదుర్కొన్నా.. మూడో గేమ్‌లో నరోకాను బాగా కట్టడి చేశాడు.
ఇతర మ్యాచ్‌ల్లో లక్ష్యసేన్ 15–21, 21–18, 21–10తో హెచ్.ఎస్. ప్రణయ్‌పై గెలవగా, కిరణ్ జార్జ్ 6–21, 12–21తో మూడో సీడ్ చో టియెన్ చెన్ (చైనీస్‌తైపీ) చేతిలో కంగుతిన్నాడు. మెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ షెట్టి 18–21, 21–15, 21–11తో ప్రిట్చాయ్ సుక్‌పున్–పక్కపోన్ తీరరత్సకుల్ (థాయ్‌లాండ్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.
గంటా 3 నిమిషాల మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఓడిన ఇండియన్ ద్వయం తర్వాతి రెండు గేమ్‌ల్లో తమ ట్రేడ్ మార్క్ ఆటతో చెలరేగారు. కీలక టైమ్‌లో వరుసగా పాయింట్లు నెగ్గి ముందంజ వేశారు. విమెన్స్ డబుల్స్‌లో రుతుపర్ణ–శ్వేతపర్ణ 13–21, 7–21తో లి యి జింగ్–లుయో జు మిన్ (చైనా) చేతిలో ఓడారు.