ప్రైవేటులో అమలుకు నో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రైవేటులో అమలుకు నో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
  • ప్రైవేటులో అమలుకు నో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
  • డెంగీ, మలేరియా​ చికిత్సకు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్న పేదలు
  • కేంద్ర నిధుల కోసమే రాష్ట్రంలో స్కీం అమలని విమర్శలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువైతున్నయి. ఈ రోగాలకు ఆయుష్మాన్‌‌ భారత్‌‌ స్కీమ్‌‌ కింద ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచితంగా ట్రీట్‌‌మెంట్ పొందే అవకాశం ఉన్నా, మన రాష్ట్ర ప్రజలు ఇందుకు నోచుకోవడం లేదు. మన దగ్గర ఆయుష్మాన్ స్కీమ్‌‌ను కేవలం ప్రభుత్వ దవాఖాన్లకే పరిమితం చేయడంతో పేదలు ప్రైవేటు హాస్పిటళ్లలో ఉచితంగా ట్రీట్‌‌మెంట్ పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇప్పటికే వర్షాలు, వాతావరణ మార్పులతో వేల మంది దవాఖాన్ల పాలు అవుతున్నారు. ఇలాంటప్పుడు ఉచితంగా ట్రీట్‌‌మెంట్ పొందే అవకాశం ఉంటే జనాలకు మేలు చేకూరేది. కరోనాకు ముందటి ఏడాది డెంగీ విజృంభించడంతో సర్కార్ దవాఖాన్లు కిటకిటలాడాయి. సౌలతులు లేక రోగులు ఇబ్బందులు పడ్డారు. ఈ బాధ భరించలేక మధ్య తరగతి జనాలు ప్రైవేటు హాస్పిటళ్ల బాట పట్టారు. అప్పో సప్పోజేసి ట్రీట్‌‌మెంట్ తీసుకున్నారు. ప్రైవేటు హాస్పిటళ్లు వేసే చార్జీలు భరించలేక పేద లు, దిగువ మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ప్రభుత్వ దవాఖాన్లలోనే మగ్గిపోయారు. కరోనా సమయంలోనూ ఇదే జరిగింది. ఆయుష్మాన్‌‌ స్కీమ్‌‌ను ప్రైవేటులో అమలు చేస్తే, డెంగీ, మలేరియా వంటి జ్వరాలు, కరోనా వంటి రోగాలకు పేదలు ప్రైవేటు, కార్పొరేట్‌‌ ఆస్పత్రుల్లో ట్రీట్‌‌మెంట్ తీసుకునే సౌలత్ దక్కేది. కానీ, రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో ఆ అవకాశం లేకపోయింది. 

ఆరోగ్యశ్రీ పరిస్థితీ ఇంతే
ఆరోగ్యశ్రీ పరిధిలో డెంగీ, మలేరియా ఉన్నాయని చెప్పడమే తప్పితే, ప్రైవేటు హాస్పిటళ్లలో వాటిని అమలు చేయడంలేదు. ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లి ఆరోగ్యశ్రీ కింద ట్రీట్‌‌మెంట్ చేయాలని అడిగితే వింతగ చూస్తున్నారు. అసలు ఆరోగ్యశ్రీ కింద జ్వరాలకు చికిత్స లేనేలేదు అని చెబుతున్నారు. డబ్బులు కట్టి ట్రీట్‌‌మెంట్ చేయించుకుందామంటే, బిల్లు మోత మోగిస్తున్నారు. దీంతో జనాలకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర సర్కార్‌‌‌‌ నిర్ణయంతో జనాల జేబుకు చిల్లు పడుతుండగా, సర్కార్ దవాఖాన్లకు మాత్రం ఆదాయం వస్తోంది. ప్రభుత్వ దవాఖాన్లలో చేసే అన్ని చికిత్సలకు ఆయుష్మాన్‌‌ను వర్తింపజేస్తున్నారు. జ్వరాలు, డెలివరీలు సహా 1350 రకాల చికిత్సలకు కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయి. దీని కోసమే ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. దీంతో ప్రభుత్వ దవాఖాన్లలో చేసే ప్రతి చికిత్సకు కేంద్రం నుంచి నిధులు పొందే అవకాశం దొరుకుతుంది. ఉదాహరణకు.. ఆయుష్మాన్ స్కీమ్‌‌ పరిధిలో డెంగీ, మలేరియా ఉన్నాయి. వీటికి ప్రభుత్వ దవాఖాన్లలో ఎవరైనా ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటే, ఈ మేరకు ఆయుష్మాన్ కింద ఆయా హాస్పిటళ్లకు నిధులు వస్తాయి.