ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్ తో రాష్ట్రంలో 5.76 లక్షల మందికి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్

ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్ తో రాష్ట్రంలో 5.76 లక్షల మందికి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అనారోగ్యం బారిన పడుతున్న పేదలను ఆయుష్మాన్ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదుకుంటోంది.  గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు 5,76,304 మంది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ట్రీట్​మెంట్​ తీసుకున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.193.29 కోట్లు కేటాయించింది. దేశవ్యాప్తంగా రూ.3,200 కోట్లను ఈ స్కీమ్ కోసం కేంద్రం ఖర్చు చేసింది. దేశంలో 2017 నుంచే ఆయుష్మాన్ భారత్  ప్రారంభించినప్పటికీ.. మన రాష్ట్రంలో అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఒప్పుకోలేదు.

ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీనే బెటరని చెబుతూ ఆయుష్మాన్ అమలుకు నో చెబుతూ వచ్చింది. దీంతో రాష్ట్రం ఏటా సుమారు రూ.150 కోట్లు నష్టపోయింది. గవర్నర్ చొరవ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా రాష్ట్రంలో అమలు చేయాలని రెండేండ్ల కింద నిర్ణయించారు. చివరికి గతేడాది మే 21వ తేదీ నుంచి ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాలను కలిపి అమల్లోకి తీసుకొచ్చారు. ఆయుష్మాన్ స్కీమ్ కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచితంగా ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందిస్తున్నారు.

దీంతో ఆరోగ్యశ్రీ లిమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ప్రస్తుతం ఈ రెండు స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కింద ఉచితంగా ట్రీట్ మెంట్​ అందిస్తున్నారు. కానీ, హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తుండడం, ప్యాకేజీల ధరలు సవరించకపోవడం వల్ల ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కింద ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చేయడానికి ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లు నిరాకరిస్తున్నాయి.

ఆయుష్మాన్ కార్డులివ్వట్లే

ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టు మన స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కార్డులను ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ కార్డుతోనే ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద చికిత్స అందిస్తున్నారు. దీని వల్ల ఇతర రాష్ట్రాల్లోకి వలస వెళ్లిన మన రాష్ట్ర పేదలకు అన్యాయం జరుగుతోంది. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నవాళ్లు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఫ్రీగా ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పొందొచ్చు. కార్డు లేకపోవడం వల్ల మన దగ్గరి నుంచి మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడే రకరకాల పనులు చేసుకుని జీవిస్తున్న వారికి ఆయుష్మాన్ ఉపయోగపడడం లేదు. కానీ మన స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వలస వచ్చిన వాళ్లు మాత్రం ఆయుష్మాన్ కార్డులతో ఇక్కడి ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రీట్​మెంట్​ పొందగలుగుతున్నారు.