
అతను అద్భుతంగా నటిస్తాడు. అంతేకాదు.. చక్కగా పాడతాడు. అది మాత్రమేనా.. ఎంతో బాగా రాస్తాడు. అక్కడితో అయిపోయిందా.. మంచి హోస్ట్ కూడా. కొందరు ఏదో ఒకటి చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. కొందరు మాత్రం ఎన్నో చేస్తారు. ఏం చేసినా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఈ రెండో కోవకి చెందినవాడే ఆయుష్మాన్ ఖురానా. ఈ మల్టీ టాలెంటెడ్ బాలీవుడ్ యాక్టర్ ఇవాళే పుట్టాడు.
నాన్న జోస్యం నిజమై..
1984లో ఇదే రోజున ఛత్తీస్‌గడ్‌లో పుట్టాడు ఆయుష్మాన్. తండ్రి జ్యోతిష్యుడు. నటుడిగా కొడుకు చక్రం తిప్పబోతున్నాడని ఆయన ముందే గుర్తించాడు. అతని జాతకరీత్యా మొదట పెట్టిన నిశాంత్ అనే పేరు సరికాదనిపించి.. మూడేళ్ల వయసులో ఆయుష్మాన్‌గా మార్చేశారు. చిన్నప్పటి నుంచీ ఆయుష్మాన్ చురుకే. ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ చేశాడు. మాస్ కమ్యూనికేషన్స్ లో పీజీ చేశాడు. కాలేజ్ డేస్‌లోనే నాటకాలు రాసి ప్లే చేసేవాడు. నేషనల్ కాలేజ్ ఫెస్టివల్స్ లో ఎన్నో బహుమతులు గెల్చుకున్నాడు. అశ్వత్థామ పాత్రకి బెస్ట్ స్టేజ్ ఆర్టిస్టుగా అవార్డు కూడా తీసుకున్నాడు. పదిహేడేళ్ల వయసులో ఓ రియాలిటీ షో ద్వారా టెలివిజన్ ఫీల్డ్ లోకి ఎంటరయ్యాడు. ఇరవయ్యో యేట రోడీస్ గేమ్ షోలో పాల్గొని గెలిచాడు. ఇంకా ఎన్నో షోస్ చేశాడు. ఇక చదువు పూర్తయ్యాక ఢిల్లీ బిగ్ ఎఫ్ఎంలో చేరాడు. ‘బిగ్ చాయ్.. మాన్ న మాన్.. మై తేరా ఆయుష్మాన్’ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయ్యాడు. 2007లో యంగ్ అచీవర్ అవార్డు అందుకున్నాడు. భారత్ నిర్మాణ్ అవార్డ్ తీసుకున్నవారిలో అతి పిన్న వయస్కుడు ఆయుష్మానే.
అడుగే సంచలనం
2012లో సూజిత్ సర్కార్ తీసిన ‘విక్కీ డోనర్’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఆయుష్మాన్. యమీ గౌతమ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి జాన్ అబ్రహామ్ దర్శకుడు. నిర్మాతగా తన తొలి వెంచర్ కావడంతో ప్రమోషనల్ సాంగ్‌లోనూ నటించాడు జాన్. ఈ సినిమా పెద్ద హిట్టయ్యింది. సంచలనమూ సృష్టించింది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అలాంటిది. డబ్బు కోసం స్పెర్మ్ డొనేట్ చేయడానికి సిద్ధపడే కుర్రాడి పాత్ర ఆయుష్మాన్ది. కాస్త బోల్డ్ టాపిక్ కావడంతో వామ్మో అన్నారు కొందరు. అయితే కథలోని దమ్ము, ఆయుష్మాన్ నటన సినిమా సక్సెస్‌ని ఆపలేకపోయాయి. ఆ తర్వాత నౌటంకీ సాలా, బేవకూఫియా, హవాయీజాదా, దమ్ లగాకే హైసా, మేరీ ప్యారీ బిందూ, బరేలీకీ బర్ఫీ అంటూ చాలా సినిమాలు చేశాడు.
గట్స్ ఉన్న హీరో
ఆయుష్మాన్ గురించి మాట్లాడాలంటే ముందు అతని స్టోరీ సెలెక్షన్ గురించి మాట్లాడాలి. డిఫరెంట్ కాన్సెప్టులను ఒడిసిపట్టడంలో అతని తర్వాతే ఎవరైనా. మొదటి సినిమాతోనే ఓ వెరైటీని చూపించిన అతను.. ‘శుభ్ మంగళ్ సావధాన్’తో మరోసారి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. అందరూ మాట్లాడటానికే మొహమాటపడే ఓ సున్నితమైన సమస్య ఆధారంగా తీసిన సినిమా ఇది. ఆ వెంటనే ‘అంధాధున్’లో గుడ్డివాడిగా కనిపించాడు ఆయుష్మాన్. మ్యుజీషియన్‌గా ఎదగడానికి చూపులేనివాడిగా నటించడం, ఆ తర్వాత నిజంగానే చూపు పోవడం, అనుకోకుండా పెద్ద క్రైమ్‌కి విట్నెస్గా మారడం, దానివల్ల సమస్యలు ఎదుర్కోవడం లాంటి అంశాలతో తీసిన ఈ సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించి నేషనల్ అవార్డును అందుకున్నాడు ఆయుష్మాన్. ఆ తర్వాత ‘ఆర్టికల్ 15’లో మరో సాహసం చేశాడు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తీసిన ఈ సినిమా సంచలనం సృష్టించింది.
తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కొందరు రభస చేశారు. పోస్టర్లు చించారు. థియేటర్లు పాడు చేశారు. అవన్నీ దాటుకుని వచ్చి గొప్ప సినిమాగా నిలిచింది ‘ఆర్టికల్ 15’. నెక్స్ట్ ‘డ్రీమ్‌గాళ్’లో ఆడపిల్ల వాయిస్‌తో కస్టమర్ కేర్ సెంటర్లో పని చేసే అబ్బాయిగా కనిపించాడు. ఆపైన ‘బాల’లో జుట్టు ఊడిపోయి ఇబ్బంది పడే బట్టతల వ్యక్తిగా నటించాడు. అదీ అయ్యాక ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’లో గే ఇష్యూని టచ్ చేశాడు. ‘ఛండీగడ్ కరే ఆషికీ’లో ట్రాన్స్‌జెండర్ రైట్స్ గురించి మాట్లాడాడు. ‘అనేక్’లో దేశ సమైక్యత గురించి చెప్పాడు. ఇలా రకరకాల కాన్సెప్టులను ఎంచుకున్నాడు. కొందరు హీరోలు ఊహించడానికి కూడా భయపడే పాత్రల్ని పోషించాడు. ప్రతి పాత్రకీ తనే పర్ఫెక్ట్ అనిపించేంత గొప్పగా నటించి మెప్పించాడు. గట్స్ ఉన్న హీరో అనిపించుకున్నాడు.
సినిమాలు చేశామా.. డబ్బులు సంపాదించామా అన్నట్టు కాకుండా.. ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్తదనాన్ని చూపించాలి, సందేశాన్ని ఇవ్వాలి అనుకోవడమే ఆయుష్మాన్‌ని ప్రత్యేకంగా నిలబెట్టింది. వ్యక్తిగా కూడా అతని గురించి అందరూ గొప్పగా చెబుతారు. తన తమ్ముడు అపరాక్షి ఖురానాని తన అడుగుజాడల్లో నడిపించాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న తన భార్య తాహిరా కశ్యప్‌కి అనుక్షణం అండగా నిలబడ్డాడు. ఎంత బిజీగా ఉన్నా కూతురికి, కొడుక్కి తగినంత సమయం ఇచ్చి తీరతానని అంటుంటాడు. వ్యక్తిగా అతని పర్సనాలిటీ.. నటుడిగా అతని వెర్సటాలిటీయే అందరూ ప్రేమించేలా చేస్తున్నాయి. హ్యాపీ బర్త్ డే అంటూ అతని కోసం విషెస్ వెల్లువెత్తుతున్నాయి.