హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్, ఇతరులకు నోటీసులు జారీ అయ్యాయి. హెచ్‌సీఏ 2021–22లో నిర్వహించిన రెండు రోజుల లీగ్‌లో నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ను అనుమతించాలని అప్పట్లో హైకోర్టు ఆదేశించింది. 2021 ఆగస్టులో వెలువడిన ఆ ఉత్తర్వులను అమలు చేయలేదని హెచ్‌సీఏపై నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ విచారించారు. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలియజేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 23కు వాయిదా వేశారు.
