- పోటాపోటీగా నామినేషన్లు
కామారెడ్డి, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో బీ ఫారం దక్కుతుందో.. లేదోనని ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చివరి వరకు సస్పెన్స్‌లో పెట్టారు. బీ ఫారాలు ఇవ్వకున్నా కొందరు ఆశావహులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ లో టికెట్ల కోసం పోటీ అధికంగా ఉంది. మెజార్టీ వార్డుల్లో ఇద్దరు , ముగ్గురు పోటీ పడుతున్నారు.
కామారెడ్డిలో..
49 వార్డులు ఉన్న కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు నేతలు అధిక సంఖ్యలో ముందుకొస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్తరఫున కూడా నేతలు ఆసక్తి చూపుతున్నారు. 3 ప్రధాన పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ముందుగా బీ -ఫారాలు ఇస్తే టికెట్ రాని వారు ప్రత్యర్థి పార్టీలకు వెళ్లే అవకాశం ఉందని, ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కాంగ్రెస్ లో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఏవరికి వారే తమ పార్టీ ముఖ్యుల ద్వారా టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీ-ఫారాలు అభ్యర్థుల చేతికి ఇవ్వకుండా నామినేషన్ల దాఖలు పూర్తైన తర్వాత నేరుగా అధికారులకు అందజేయనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ తరఫున ఇప్పటికే ఒక్కో వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేశారు. బీజేపీ తరఫున కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించటం, పార్లమెంట్ ఎన్నికల్లో అధిక ఓట్లు వచ్చినందున మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు తమ వైపు ముగ్గు చూపుతారని అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. ఈసారి కూడా అవ్వే ఫలితాలు వస్తాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మిగతా చోట్ల..
బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుందల్లో కూడా ఏ పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. నామినేషన్లు కంప్లీట్ అయ్యే వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. టికెట్ ఆశించేవారు నామినేషన్ వేయాలని సూచిస్తున్నారు. బాన్సువాడలో అధికార కాంగ్రెస్ తరఫున పోటీకి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ టికెట్లు రావని భావించే వాళ్లు ప్రత్యర్థి పార్టీల వైపు వెళ్తున్నారు.
