గోద్రా తరహా ఘోరం కర్నాటకలోనూ జరగొచ్చు : బీకే హరిప్రసాద్

గోద్రా తరహా ఘోరం కర్నాటకలోనూ జరగొచ్చు : బీకే హరిప్రసాద్

బెంగళూర్ :  అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉండాలని కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ హెచ్చరించారు. గుజరాత్​ లో జరిగిన గోద్రా దారుణాన్ని గుర్తుచేస్తూ ఈ నెల 22న కర్నాటకలోనూ అలాంటి ఘోరం జరిగే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యకు వెళ్లే భక్తులకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వమే చేసి పంపించాలని, ఎలాంటి అల్లర్లకు తావివ్వొద్దని అన్నారు. ఈ మేరకు హరిప్రసాద్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కర్నాటకలోనూ గోద్రా తరహా ఘటన జరిగే అవకాశం ఉందని నాకు సమాచారం ఉంది. 

కొన్ని సంస్థల అధిపతులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి, పలువురు బీజేపీ నేతలను రెచ్చగొట్టారు. ఇలాంటి దారుణం ఏదో జరిపేందుకు కుట్ర జరుగుతోంది. అయితే, ఆ వివరాలను బహిరంగంగా వెల్లడించలేను” అని అన్నారు. మరోవైపు, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రాజకీయ కార్యక్రమంలా మారిందని విమర్శించారు. ‘హిందూమత గురువుల చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం జరిగితే ఆహ్వానం ఉన్నా లేకున్నా అయోధ్యకు వెళ్లేవాడిని. కానీ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా జరుగుతున్నది’ అని హరిప్రసాద్ విమర్శించారు.