WI vs PAK: ఇతనా కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేసేది: 63 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ లేదు.. పాకిస్థాన్‌కు భారంగా బాబర్

WI vs PAK: ఇతనా కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేసేది: 63 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ లేదు.. పాకిస్థాన్‌కు భారంగా బాబర్

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన మార్క్ తో అలరించలేకపోతున్నాడు. సమీప భవిష్యత్తులో కోహ్లీ రికార్డ్స్ బ్రేక్ చేయడం బాబర్ అజామ్ కే సాధ్యమని ఇప్పటికీ చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు బాబర్ ఫామ్ లో లేడు. గత రెండేళ్లుగా ఈ పాక్ స్టార్ బ్యాటర్  బాబర్ ఫామ్ ఏమంత గొప్పగా లేదు. ఫార్మాట్ ఏదైనా, టోర్నీ ఏదైనా రాణించలేకపోతున్నాడు. కెరీర్ ప్రారంభంలో టాప్ ఫామ్ తో దూసుకెళ్లిన ఈ పాక్ మాజీ కెప్టెన్ రెండేళ్లుగా చెత్త బ్యాటింగ్ తో జట్టుకు భారంగా మారాడు. 

అంతర్జాతీయ క్రికెట్ లో చివరిసారిగా 2023 ఆగస్టులో పసికూన నేపాల్ పై సెంచరీ చేసిన తర్వాత ఇప్పటివరకు 100 పరుగుల మార్క్ అందుకోలేకపోయాడు. ఓవరాల్ గా అన్ని ఫార్మాట్ లలో కలిపి 63 ఇన్నింగ్స్ ల్లో ఈ పాక్ స్టార్ బ్యాటర్ కు సెంచరీ లేకపోవడం గమనార్హం. ఒకటి రెండు ఇన్నింగ్స్ లు మినహాయిస్తే దాదాపు ప్రతి మ్యాచ్ లో ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లోనూ విఫలమవుతున్నాడు. తొలి వన్డేలో 47 పరుగులు చేసి పర్వాలేదనిపించిన బాబర్.. ఆదివారం (ఆగస్టు 10) ప్రారంభమైన రెండో వన్డేలో డకౌటయ్యాడు.

ట్రినిడాడ్‌లోని తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ బౌలింగ్ లో ఖాతా తెరవకుండానే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో బాబర్ అజామ్ పై ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అతను ఇక క్రికెట్ ఆడడం దండగ అని తేల్చేస్తున్నారు. కంబ్యాక్ ఇవ్వడం ఇక అసాధ్యమని భావిస్తున్నారు. ఇప్పటికే కెప్టెన్సీతో పాటు టీ20 జట్టులో స్థానం కోల్పోయిన ఆజామ్.. ఇలాంటి పేలవ ఫామ్ ను కొనసాగిస్తే వేటు పడడం ఖాయం. అదే జరిగితే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఆశ్చర్యం లేదు.