
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ జిల్లా రాంనగర్‍లోగల చేపల మార్కెట్ సమీపంలోని సులభ్కాంప్లెక్స్ లో గుర్తు తెలియని నవజాత శిశువు మృతదేహాన్ని శనివారం నిర్వాహకులు గుర్తించారు. చేపల మార్కెట్ సమీపంలో ఉన్న సులభ్కాంప్లెక్స్ ను ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు శుక్రవారం రాత్రి 7 గంటలకు ఎప్పటిలానే బంద్ చేసుకొని వెళ్లిపోయారు. శనివారం ఉదయం 6.30 గంటలకు వచ్చి క్లీన్ చేయడానికి మరుగుదొడ్డి వద్దకు వెళ్లి చూడగా మృతిచెందిన నవజాత శిశువు గుడ్డలో పెట్టి కనిపించింది. వెంటనే టు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పుట్టిన శిశువును వద్దనుకొని అక్కడ వదిలి వెళ్లారా లేక అనుకోని పరిస్థితిలో వాష్రూమ్ కు వచ్చి ప్రసవించి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. శిశువు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పరీక్షలు జరిపారు. దర్యాప్తు అనంతరం మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు చేశారు.