కొడుకును ఎత్తుకుని.. రిక్షా తొక్కుతూ

కొడుకును ఎత్తుకుని..  రిక్షా తొక్కుతూ

ఓ చేత భుజాన బిడ్డను ఎత్తుకుని మరో చేత్తో రిక్షా తొక్కతూ ఓ తండ్రి పడుతున్న కష్టాన్ని చూస్తే ఎవరికైనా దు:ఖం రావాల్సిందే. ఒంటి మీద కనీసం బట్టలు కూడా లేని ఆ పసివాడి దీనావస్థను చూస్తే కంట నీరు కారాల్సిందే. హృదయ విదారకరమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

బీహార్ కు చెందిన రాజేశ్ మల్దార్ పొట్టకూటి కోసం పదేళ్ల కిందట  మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు వచ్చాడు. రిక్షా తొక్కుతూ కొత్త జీవితాన్ని ఆరంభించాడు. కొన్నేళ్ల తర్వాత సియోనిలోని కన్హర్ వాడ గ్రామానికి చెందిన అమ్మాయితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి... పెళ్లికి దారి తీసింది. అనంతరం వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని... ఇద్దరు పిల్లలతో రాజేశ్ మల్దార్ లైఫ్ బిందాస్ గా సాగుతున్న టైంలో... రాజేశ్ భార్య అతడిని, పిల్లలిద్దరినీ వదిలి మరొక వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో రాజేశ్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఓ పక్క ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్య మోసం చేసి వెళ్లిపోవడం... ఇంకో పక్క పిల్లలిద్దరూ పసివాళ్లు కావడంతో రాజేశ్ కు ఏం చేయాలో అర్ధం కాలేదు. పిల్లల్ని గుండెలకు హత్తుకొని గట్టిగా ఏడ్చాడు. తన పిల్లలిద్దరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు.

పుట్టెడు బాధతో మళ్లీ రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మూడేళ్ల కూతురును ఇంటి వద్దే వదిలేసి... ఏడాది వయసున్న కొడుకును మాత్రం తన వెంట తీసుకెళ్తున్నాడు. బాబు చిన్నవాడు కావడంతో ఓ చేత అతడిని భుజాన వేసుకుని... ఇంకో చేత్తో రిక్షా తొక్కుతూ బతుకు బండిని లాగుతున్నాడు. తాజాగా కొడుకుతో తాను రిక్షా తొక్కుతున్న దృశ్యాన్ని  ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. షేర్ చేసిన గంటల వ్యవధిలోనే ఆ వీడియో వైరల్ గా మారింది. అతడి కష్టాన్ని చూసి కొంత మంది అయ్యో పాపం అంటుండగా... మరికొంత మంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.