
మూడు రోజుల పాటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ కాకుండా ఈ నెల 12, 13న రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీఏసీ సమావేశానికి సీఎం హాజరుకాలేదు. టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీశ్, నిరంజన్ రెడ్డి, గంగుల కమాలాకర్, కాంగ్రెస్ నుంచి భట్టి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ హాజరయ్యారు. బీజేపీ నేతలను బీఏసీ సమావేశానికి పిలవలేదు.
ఎంతమంది ఉంటే బీఏసీకి పిలుస్తారు?
బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి స్పీకర్ పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. రాజాసింగ్ ఒక్కరున్నప్పుడు బీఏసీ సమావేశానికి పిలిచారని, ఇవాళ బీజేపీకి ముగ్గురు సభ్యులున్నప్పుడు ఎందుకు పిలవడంలేదని ప్రశ్నించారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశానికి పిలుస్తారో చెప్పాలని, అంతమందిని ఈ అసెంబ్లీ పదవీ కాలంలోపే తెచ్చుకుంటామని రఘునందన్ రావు చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి మూడు రోజుల్లో సభను ముగించాలనుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. గతంలో కూడా ఇదే విషయమై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వివరించామని, అయినా తమని బీఏసీ సమావేశానికి పిలవలేదని తెలిపారు. సీఎం చెప్పినట్లుగా స్పికర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు.
12కు అసెంబ్లీ వాయిదా
ఉదయం అసెంబ్లీ ప్రారంభమవ్వగానే ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్ రెడ్డిల మృతికి శాసన సభ్యులు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో వారు చేసిన సేవలను అసెంబ్లీ కొనియాడింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించింది. సభలో సభ్యులు రెండు నిముషాల పాటు మౌనంపాటించారు. తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీని ఈ నెల 12కు వాయిదా వేశారు.