పక్కా ప్లాన్ తోనే దాడి...హింసకు పాల్పడ్డ వారిని వదలం : అనిల్ విజ్

పక్కా ప్లాన్ తోనే దాడి...హింసకు పాల్పడ్డ వారిని వదలం : అనిల్  విజ్

చండీగఢ్: నూహ్  జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) యాత్రపై ప్రీప్లాన్ తోనే అటాక్  చేశారని హర్యానా హోంమంత్రి అనిల్  విజ్  అన్నారు. హింసకు పాల్పడిన వారెవరినీ వదలబోమని ఆయన స్పష్టం చేశారు. హింసకు పాల్పడిన వారిలో ఇప్పటి వరకూ 202 మందిని అరెస్టు చేశామని, 80 మందిని ప్రివెంటివ్  డిటెన్షన్ లోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. అలాగే 102 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని వెల్లడించారు. అంబాలాలో మీడియాతో మంత్రి మాట్లాడారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

 ‘‘దుండగులు పక్కా ప్లాన్ తోనే దాడికి పాల్పడ్డారు. ప్రతిఒక్కరి చేతిలో లాఠీ ఉంది. అలాగే దుండగులు బుల్లెట్లు కూడా ప్రయోగించారు. ఎవరో ఒకరు ఆ లాఠీలు, బుల్లెట్లను సప్లై చేసి ఉండాలి. లేకపోతే అవి ఎక్కడి నుంచి వస్తాయి? హింసాత్మక ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తం. సూత్రధారిని తప్పకుండా పట్టుకుంటం” అని మంత్రి పేర్కొన్నారు. హింసకు పాల్పడిన వారి ఇండ్లను కూల్చివేయడంపై స్పందిస్తూ అవసరమైన ప్రతీచోటా బుల్డోజర్లను ప్రయోగిస్తామన్నారు.

జర్నలిస్టులు వీడియో ఫుటేజీలు ఇవ్వాలి

నూహ్​లో సైబర్ క్రైం పోలీస్  స్టేషన్​పై దాడిని సీరియస్​గా తీసుకున్నామని మంత్రి అనిల్​ విజ్  అన్నారు. ఆ పీఎస్​పై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని మంత్రి తెలిపారు. వీహెచ్​పీ ఊరేగింపులో పాల్గొన్న వారి వాంగ్మూలాలను కూడా సేకరిస్తున్నారని చెప్పారు. అల్లర్లపై కవరేజీ కోసం నూహ్​కు వెళ్లివచ్చిన జర్నలిస్టులు వీడియో ఫుటేజీలు ఇవ్వాలని మంత్రి కోరారు. దర్యాప్తు జరుపుతున్న అధికారులకు ఆ వీడియోలు ఇచ్చి సహకరించాలన్నారు. ఇక రాజస్థాన్​లో ఓ కేసులో నిందితుడైన గోరక్షకుడు మోనూ మనేసార్​ను అరెస్టు చేయడంలో హర్యానా పోలీసులు సహకరించడంలేదని రాజస్థాన్  సీఎం గెహ్లాట్  చేసిన ఆరోపణపైనా మంత్రి స్పందించారు. ‘‘బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు కాంగ్రెస్  సీఎంలు చాలా ఫేమస్. వారు అలాగే మాట్లాడుతారు. రాజస్థాన్  పోలీసులే వచ్చి అతడిని అరెస్టు చేయొచ్చు కదా” అని మంత్రి వ్యాఖ్యానించారు..

24 అక్రమ మెడికల్ షాపులు..

నూహ్ జిల్లాలోని తౌరులో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు శనివారం కూడా కొనసాగాయి. అక్రమంగా నిర్మించిన 24 మెడికల్ షాపుల ను మునిసిపల్  అధికారులు నేలమట్టం చేశారు. అక్రమ వలసదారుల ఇండ్లను కూడా కూల్చివేశారు. పోలీసు భద్రత నడుమ అధికారులు.. షహీద్  హసన్  ఖాన్ మేవాటి ప్రభుత్వ మెడికల్  కాలేజీలోకి ప్రవేశించి 24 మెడికల్  షాపులను నేలమట్టం చేశారు.