ఆర్టీసీలో బలహీనులే ఎక్కువ… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90.5%

ఆర్టీసీలో బలహీనులే ఎక్కువ… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90.5%

వాళ్లంతా రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులే

నెల జీతం వస్తే కానీ సాగని బతుకుబండి

ఇక సగం ఆర్టీసీలో రిజర్వేషన్లు డౌటే

ఇప్పటికే స్పందించిన బీసీ కమిషన్​

త్వరలో ఎస్సీ కమిషన్​కు కార్మికుల ఫిర్యాదు

ఆర్టీసీ కార్మికుల్లో సగం కంటే ఎక్కువ మంది బీసీలే ఉన్నారు. 51శాతం అంటే 25,342 మంది బీసీలు ఉండగా.. ఆ తర్వాత స్థానంలో ఎస్సీలు ఉన్నారు. 19శాతం అంటే 9,495 మంది ఎస్సీలు ఉండగా.. మైనార్టీలు 14 శాతం అంటే 6,900 మంది, ఎస్టీలు 6.5 శాతం అంటే 3,180 మంది ఉన్నారు. ఓసీలు 9.5 శాతం అంటే 4,577 మంది మాత్రమే ఉన్నారు. ఆర్టీసీలోని మొత్తం 49,494 మంది కార్మికుల్లో 4,577 మంది మినహా అంతా బలహీనవర్గాల ప్రజలే. సంస్థలో రిక్రూట్‌మెంట్‌ సమయంలో రిజర్వేషన్‌ పాటించడంతో అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అవకాశం దక్కించుకున్నారు. అదే ఇప్పుడు సగం ఆర్టీసీ ప్రైవేట్‌ పరమైతే రిజర్వేషన్లు డౌటేనని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటుదే రాజ్యమవుతుందని, బలహీనవర్గాలకు అవకాశాలు తగ్గిపోతాయని అంటున్నారు.

త్వరలో ఎస్సీ కమిషన్‌ దృష్టికి..?

ఆర్టీసీలో సగం మందికిపైగా బీసీలే ఉండటంతో వారి సమస్యలపై, సమ్మెపై జాతీయ బీసీ కమిషన్‌ కూడా స్పందించింది. ఇటీవల సీఎస్‌కు, ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. ‘సెల్ఫ్​ డిస్మిస్‌’ ప్రకటనపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంది. ఆర్టీసీలో బీసీలే సగం మంది ఉన్నారని, జోక్యం చేసుకోవాలని బీసీ కమిషన్‌ను ఆర్టీసీ జేఏసీ కోరడంతో పైవిధంగా స్పందించింది. బీసీల తర్వాత ఎస్సీ, ఎస్టీలు కూడా ఎక్కువగా ఉండటంతో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీలో 90 శాతానికి పైగా ఉన్న బలహీనవర్గాలంతా మిడిల్​క్లాస్​ వాళ్లే. వారందరికీ జీతాలు అంతంతే. నెలనెలా సక్రమంగా జీతం వస్తేనే పూట గడిచే పరిస్థితి. సంస్థ తమదిగానే భావించి ఆర్టీసీని కాపాడునేందుకు ఎంతగానో కష్టపడుతుంటారు. టైమ్​కు జీతాలు రాకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈఎంఐలు, లోన్లు, ఇంటి కిరాయిలు, పిల్లల స్కూలు ఫీజులు కట్టడానికి అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు రెండు నెలల నుంచి జీతాలు లేవు. అక్టోబర్​ 5న సమ్మె మొదలుపెట్టడంతో సెప్టెంబర్​ జీతమూ ఆర్టీసీ యాజమాన్యం, సర్కార్​ ఇవ్వలేదు. ఇతర డిపార్ట్‌మెంట్ల మాదిరి తమకు వేలకువేలు జీతాలు లేవని, 20 ఏండ్లుగా పనిచేస్తున్నా రూ. 22 వేల జీతం కూడా దాటలేదని కార్మికులు అంటున్నారు. జీతాలు లేక అప్పులు చేయాల్సి వస్తోందని, అవీ పుట్టడం లేదని, ఇల్లు గడవడం కష్టమైందని ఆవేదన చెందుతున్నారు. సంస్థను కాపాడుకునేందుకు తాము సమ్మె బాట పడితే ప్రభుత్వం సెల్ఫ్‌ డిస్మిస్‌, డెడ్​లైన్​ అని మొండిగా వ్యవహరిస్తోందని, డిమాండ్ల గురించి ప్రస్తావించడం లేదని అంటున్నారు.