
- పరిశీలనలో నిర్మలా సీతారామన్ పేరు
- దగ్గుబాటి పురంధేశ్వరి, వానతి శ్రీనివాస్ పేర్లు కూడా
- మహిళా నేతకు పట్టం కట్టే దిశగా కమలనాథులు
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఈ సారి మహిళా నేతలకు కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో తమ బలం పెంచుకునేందుకు ఇక్కడి మహిళా నేతనే ఎన్నుకోనున్నట్లు సమాచారం. 2023 జనవరి నాటికే జేపీ నడ్డా పదవీ కాలం ముగిసింది. 2024లో లోక్‌సభ ఎన్నికల కారణంగా జూన్ వరకు నడ్డా పదవీకాలం పొడిగించారు.
అయితే ఇప్పటికీ ఆయనే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. త్వరలోనే జాతీయ అధ్యక్ష పదవిని కొత్త వారికి అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో దక్షిణాదికి చెందిన ముగ్గురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. మహిళా కీలక నేతలైన నిర్మలా సీతారామన్, పురుందేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే నిర్మల సీతారామన్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌తో సమావేశమయ్యారు. నిర్మలా సీతారామన్ రేసులో ముందున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిర్మల జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికైతే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం పెరిగే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తోంది. నిర్మలా సీతారామన్ గతంలో రక్షణశాఖ మంత్రిగా సేవలందించారు.
ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీలోనూ ఆమెకు సంపూర్ణమైన మద్దతు ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి పేరు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షురాలి పదవికి పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
ఇటీవల ఆపరేషన్ సిందూర్ ప్రతనిధి బృందానికి కూడా ఆమె సెలెక్ట్ అయ్యారు. ఏపీ బీజేపీకి కీలక నేతగా ఉన్నారు. తమిళనాడు చెందిన మహిళా నేత, న్యాయవాది వనతి శ్రీనివాస్ పేరు కూడా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఆమె 1993 లో బీజేపీలో చేరారు. బీజేపీ తమిళనాడు సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.