
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జూలై 4) హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సమరభేరి సభ జరిగింది. ఈ సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడున్న 119 స్థానాలు కాస్త.. 153కు పెరుగుతాయని చెప్పారు. కొత్త అసెంబ్లీ సీట్లు పెరగనున్న నేపథ్యంలో ప్రజా సేవలో ఉన్నవారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామన్నారు.
ALSO READ | మోడీ వస్తారో.. కేసీఆర్ వస్తారో రండి.. ఎక్కడైనా చర్చకు సిద్ధం: CM రేవంత్ ఓపెన్ ఛాలెంజ్
అలాగే వచ్చే ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్లు అమలు అవబోతున్నాయని.. దీంతో మహిళలకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇక వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 100 కంటే ఒక్క సీటు తగ్గినా నాదే బాధ్యత అని అన్నారు. అలాగే తెలంగాణలో 15 పార్లమెంట్ స్థానాల్లో దక్కించుకుంటామని జోస్యం చెప్పారు.
కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన చోట పాత నేతలు బాధపడకండని.. మీకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించే బాధ్యత పార్టీ చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. మంత్రులుగా చేసే బాధ్యత ఖర్గే, రాహుల్ గాంధీ చూసుకుంటారన్నారు. నేతలు టికెట్ల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని.. మీకు టికెట్లు ఇచ్చి దారిఖర్చులు కూడా ఇచ్చి పంపుతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.