మోడీ వస్తారో.. కేసీఆర్ వస్తారో రండి.. ఎక్కడైనా చర్చకు సిద్ధం: CM రేవంత్ ఓపెన్ ఛాలెంజ్

మోడీ వస్తారో.. కేసీఆర్ వస్తారో రండి.. ఎక్కడైనా చర్చకు సిద్ధం: CM రేవంత్ ఓపెన్ ఛాలెంజ్

హైదరాబాద్: ప్రధాని మోడీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‎కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రైతు రాజ్యం ఎవరిదో పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చ పెడదాం. ఎక్కడైనా చర్చకు మేం సిద్ధం. ప్రధాని మోడీ వస్తారో.. కేసీఆర్ వస్తారో రండి. రైతు రాజ్యం ఎవరిదో తేల్చుకుందామని సవాల్ విసిరారు. రైతు భరోసా స్కీమ్ విఫలమవుతోందని కొందరు గోతికాడి నక్కల్లా ఎదురు చూశారని.. కానీ కేవలం 9 రోజులల్లోనే రైతు భరోసా నిధులు రైతులు ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. 

శుక్రవారం (జూలై 4) హైదరాబాద్‎లోని ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సమరభేరి సభ జరిగింది. ఈ సభకు హాజరై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వందలాది మంది బలిదానంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యువత ఉద్యోగాలు అడిగితే కేసీఆర్ గొర్రెలు, బర్రెలు పెంచుకోమన్నారు. వాళ్లు బలిదానం చేసింది గొర్రెలు, బర్రెల కోసమా అని ఫైర్ అయ్యారు. 

ALSO READ | 119 కాదు 153 అసెంబ్లీ సీట్లు కాబోతున్నయ్.. 100 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తం: CM రేవంత్

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఆ 60 వేల మందిని నిలబెట్టి మరీ లెక్క చెబుతాం. అందులో ఒక్కటి తప్పినా నేను వారి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా. మరీ ఉద్యోగ నియామకాలపై చర్చకు వచ్చేందుకు కేసీఆర్, కిషన్ రెడ్డికి దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. వారిని బట్టలిప్పే కొడితే అప్పుడు ఇందిరమ్మ గొప్పతనం ఏంటో తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, సన్న బియ్యం వంటి అనేక హామీలు అమలు చేస్తున్నామని.. కానీ పనిలో పడి చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామన్నారు. వీటిని కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దుబాయ్ నుంచి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించాలని.. ఈ యుద్ధంలో  కల్వకుంట్ల గడీ తునాతునకలు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషితోనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పోరాడిన వారిని గెలిపించుకునే బాధ్యత నాదన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలకు అన్ని పదవులు దక్కే వరకు విశ్రమించనని అన్నారు.