
Sigachi Accident: ఇటీవల తెలంగాణలోని పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో అసలు పరిశ్రమలో భద్రతా చర్యలపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రమాదంలో మరణించిన వారికి పరిహారం, ఇన్సూరెన్స్ ఎంత వస్తాయి. ఎన్నాళ్లకు వస్తాయనే చర్చ కొనసాగుతోంది.
అయితే తమ పరిశ్రమ పూర్తిగా ఇన్సూరెన్స్ చేయబడిందని సిగాచి యాజమాన్యం వెల్లడించింది. అయితే ఇక్కడ ఇన్సూరెన్స్ చెల్లింపులో అనేక లేయర్స్ ఉంటాయి. ప్రాపర్టీ డ్యామేజ్, వ్యాపారంలో అంతరాయం, ఉద్యోగులకు పరిహారాలు, థర్డ్ పార్టీ చెల్లింపులు వంటి వివిధ విభాగాల కింద పరిహారం లెక్కింపు ఉండటంతో ఇది ఆలస్యం అయ్యే ప్రక్రియేనని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదకరమైన వస్తువులు ఉన్నప్పుడు పబ్లిక్ లైబిలిటీ కూడా ఇందులోకి వస్తుందని వారు చెబుతున్నారు. వ్యాపార ఆటంకాలకు కూడా కవరేజ్ ఇన్సూరెన్స్ కింద లభిస్తుంది.
రసాయన అండ్ ఫార్మా రంగాల్లోని కంపెనీలు సహజంగా ఇండస్ట్రియల్ ఆల్ రిస్క్ పాలసీలను కొంటుంటాయి. దీనికింద ప్రమాదాల నుంచి మెషినరీ పాడవటం వరకూ అన్నీ కవర్ అవుతాయి. అందువల్ల సిగాచి సంగారెడ్డి ప్లాంట్ రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఇన్సూరెన్స్ కవర్ కలిగి ఉంటుందని వెల్లడైంది. అయితే పాడైన పరిశ్రమలోని యంత్రాల స్థానంలో కొత్తవాటి ఏర్పాటుకు అయ్యే ఖర్చులను బట్టి దీనిని లెక్కిస్తారని తెలుస్తోంది. దీనిని లెక్కించేందుకు ఒక బృందం పనిచేస్తుంది.
ప్రస్తుతం సిగాచి పరిశ్రమకు ప్రస్తుతం ఉన్న ఇన్సూరెన్స్ కవర్ కింద ప్రమాదం తర్వాత 90 రోజుల వరకు నష్టపోయే లాభాలతో పాటు మూడు నెలల కానికి అయ్యే ఫిక్స్‌డ్ ఖర్చులను తిరిగి అందుకుంటుంది. ఈ కవర్ కింద కంపెనీ మూసి ఉన్న కాలంలో కోల్పోయిన లాభాలు, ఉద్యోగుల వేతనాలు, ఫ్యాక్టరీ రెంట్, కరెంట్ బిల్లులు, బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐలుతో పాటు కొన్నిసార్లు ఉత్పత్తిని వేరే చోటికి మార్చుతున్నప్పుడు అయ్యే ఖర్చులను కూడా కంపెనీ తిరిగి పొందనుంది.
ప్రమాద బాధితులకు ఇన్సూరెన్స్ కవర్ నుంచి ఏం లభిస్తాయి..?
ముందుగా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కింద బాధితులు పరిహారం అందుకుంటారు. దీని కింద కవర్ కాని వ్యక్తులు వర్క్ మెన్ కంపెన్సేషన్ కింద చట్టప్రకారం మరణం లేదా ప్రమాదం వల్ల అంగవైకల్యాలకు పరిహారం అందుకుంటారు. ఇక చివరిగా భారత లేబర్ చట్టాల ప్రకారం, ఫ్యాక్టరీస్ చట్టప్రకారం కూడా పరిహారం అందించబడుతుంది.
* వర్క్ మెన్ కంపెన్సేషన్ ప్రకారం మరణించిన ఉద్యోగి వయస్సు 35 ఏళ్లు ఉండి నెలవారీ వేతనం రూ.15వేలు ఉంటే వారికి చట్టప్రకారం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం లభిస్తుంది.
* దీనికి అదనంగా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఉంటే రూ.10 లక్షల వరకు బీమా మెుత్తంగా బాధితులు పొందుతారు.
* ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ రూ.5లక్షల నుంచి రూ.10లక్షలవ వరకు బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది.
* సిగాచి కంపెనీ కూడా ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.కోటి పరిహారంగా చెల్లిస్తామని పేర్కొంది.
అయితే ఇన్సూరెన్స్ సంస్థలు ప్రమాదంపై తమ దర్యాప్తులో కంపెనీ నిర్లక్ష్యాలు ఉన్నట్లు గమనిస్తే చెల్లించే మెుత్తాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.