న్యూయార్క్ చరిత్రలో అద్భుతం: జోహ్రాన్ మమ్దానీ విజయం వెనుకున్న 5 కారణాలివే..

న్యూయార్క్ చరిత్రలో అద్భుతం: జోహ్రాన్ మమ్దానీ విజయం వెనుకున్న 5 కారణాలివే..

న్యూయార్క్ నగర రాజకీయ చరిత్రలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. భారతీయ మూలాలు కలిగిన 34 ఏళ్ల డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ నగర మేయర్ ఎన్నికలో అంచనాలను తారుమారు చేస్తూ గెలుపును కైవసం చేసుకున్నాడు. అమెరికాలో అతిపెద్ద నగరానికి ముస్లిం వ్యక్తి మేయర్‌గా ఎన్నికైన తొలి వ్యక్తి ఆయన. మాజీ గవర్నర్ ఆండ్రూ క్వామో, రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివా వంటి ప్రముఖులను ఓడించి మమ్దానీ ఈ విజయం సాధించటం గమనార్హం. అయితే మమ్దానీ విజయానికి వెనుక ఉన్న 5 కీలక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. ముందుగా మమ్దానీ చేపట్టిన ప్రచారం సాధారణ ప్రజల సమస్యలపై కేంద్రీకృతమైంది. “అఫోర్డబిలిటీ క్రైసిస్”.. జీవనం మరీ ఖరీదుగా మారిందనే సమస్యను ప్రధాన అజెండాగా తీసుకున్నారు. “జీవితం ఇంత కష్టంగా ఉండాల్సిన పనిలేదు. ప్రభుత్వం జీవితాన్ని సులభతరం చేయాలి” అని మమ్దానీ ప్రచార వ్యూహకర్త మోరిస్ క్యాట్జ్ అన్నారు.

2. మమ్దానీ అమెరికన్లకు ఇచ్చిన సందేశం చాలా స్పష్టతతో కూడుకున్నది. ఆయన ధనవంతులపై పన్నులు విధించడం, చైల్డ్‌కేర్ విస్తరణ, గృహ హక్కుల పరిరక్షణ వంటి ప్రగతిశీల ఆలోచనలను ఎప్పుడూ దాచిపెట్టలేదు. ఆ నిజాయితీ ఆయనకు ప్రతి ఒక్కరి నుంచి మద్దతును కూడబెట్టింది.

3. పార్టీ పెద్దల మద్దతు లేకుండానే మమ్దానీ ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా, క్రీడా కార్యక్రమాలు, రాత్రివేళ లైఫ్‌స్టైల్ ఈవెంట్లు, బార్లలో నిర్వహించిన పాప్‌ సమావేశాల ద్వారా యువతతో కలిసిపోయే ప్రయత్నం సక్సెస్ అయ్యింది.

4. రాజకీయ భిన్నతలను అతిక్రమించి.. వ్యాపార వర్గాలతోనూ మంచి సంబంధాలు పెంచుకున్నారు. లారీ ఫింక్, హామిల్టన్ జేమ్స్ వంటి కార్పొరేట్ నేతలతో ఆయన చర్చలు మంచి మార్పుకు సంకేతాలుగా నిలిచాయి. అలాగే గవర్నర్ కాథీ హోకుల్‌తో సహకారాన్ని పురోగమన దిశగా తీసుకెళ్లారు.

5. ఇక చివరిగా మమ్దానీ ప్రచారం ప్రగతిశీల శక్తులకు కొత్త ఊపు ఇచ్చింది. సెనేటర్ బెర్నీ సాండర్స్, ప్రతినిధి అలెగ్జాండ్రియా ఓకాసియో-కోర్టెజ్ వంటి నాయకుల మద్దతు ఆయనకు ప్రజా ఉద్యమ రూపం ఇచ్చింది. "బ్రూక్లిన్ జెంట్రిఫైయర్స్, క్వీన్స్ టాక్సీ డ్రైవర్ల సంకీర్ణం" అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్న ఈ ఉద్యమం పాత నాయకత్వానికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది.