రాహుల్ అబద్ధం చెప్తుండు: ఓటు చోరీ ఆరోపణలను తిప్పికొట్టిన సీఎం సైనీ

రాహుల్ అబద్ధం చెప్తుండు: ఓటు చోరీ ఆరోపణలను తిప్పికొట్టిన సీఎం సైనీ

చంఢీఘర్: కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై హర్యానాలో పెద్ద ఎత్తున ఓట్ చోరీకి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిగ్ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ ఓట్ చోరీ కామెంట్స్ మరోసారి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలపై హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాశతో కూడిన అబద్ధాలని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి దృష్టిని మరల్చడానికి రాహుల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబ నాలుగు దశాబ్ధాలు దేశాన్ని పాలించిందని.. అయినప్పటికీ అధికారం కోసం రాహుల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి దేశంలో నిజమైన సమస్యలు లేవని.. దీంతో ప్రజలలో గందరగోళం, అపనమ్మకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

రాహుల్ ఏమన్నారంటే..?

హర్యానాలో భారీ స్థాయిలో ఓట్ చోరీ జరిగిందని రాహుల్ సంచలన ఆధారాలను బయటపెట్టారు. హర్యానాలో మొత్తం 2 కోట్ల ఓటర్లు ఉంటే 25 లక్షల ఓట్లు చోరీ అయినట్లు పేర్కొన్నారు. హర్యానాలో 5 రకాలుగా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు రాహుల్. డూప్లికేట్, ఇన్ వాలిడ్ ఓట్స్, బల్క్ ఓట్స్, ఫామ్ 6, ఫామ్ 7 పేరున ఐదు రకాలుగా బీజేపీ-ఎన్నికల సంఘం కలిసి ఓట్ చోరీకి పాల్పడినట్లు ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 5 లక్షల 51 వేల 619 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు. 

బ్రెజిల్ మోడల్కు 22 ఓట్లు:

హర్యానాలో ఒక్క ఫోటోతో ఒక్కో నియోజక వర్గంలో 100 ఓట్లు ఉన్నట్లు ఆరోపించారు రాహుల్. బ్రెజిల్ మహిళకు ఒకే నియోజకవర్గంలో 22 ఓట్లు ఉండటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకే అసెంబ్లీ సెగ్మెంట్ లో 10 బూత్ లలో 22 ఓట్లు ఉన్నాయని అన్నారు. సీమా, స్వీటి, సరస్వతి, సుమన్, రష్మీ లాంటి పేర్లతో ఈ మోడల్ కు ఓట్లు ఉన్నాయని ఆధారాలను బయటపెట్టారు.