పొగ రాయుళ్లకు బిగ్ షాక్.. ధూమపానం పూర్తిగా నిషేధించిన దేశం

పొగ రాయుళ్లకు బిగ్ షాక్.. ధూమపానం పూర్తిగా నిషేధించిన దేశం

మాలే: పొగ రాయుళ్లకు మాల్దీవులు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పొగాకు రహిత దేశ నిర్మాణంలో భాగంగా మాల్దీవుల్లో యువతపై శాశ్వత ధూమపాన నిషేధం విధించింది. ఈ మేరకు పొగాకు నియంత్రణ చట్టానికి ప్రభుత్వం సవరణ చేసింది. సవరించిన చట్ట ప్రకారం.. 2007, జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరికైనా పొగాకు అమ్మకం, వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. తద్వారా ఒక తరంపై శాశ్వత ధూమపాన నిషేధం ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా మాల్దీవులు రికార్డ్ సృష్టించింది. పొగాకు రహిత తరాన్ని సృష్టించడం, ధూమపాన సంబంధిత వ్యాధులను తీవ్రంగా తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. 

కొత్త చట్టం ఏం చెబుతుందంటే..?

మాల్దీవులు ప్రభుత్వం పొగాకు నియంత్రణ చట్టానికి చేసిన కొత్త సవరణ ప్రకారం.. 2007, జనవరి 1 లేదా లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరూ మాల్దీవులలో పొగాకు ఉత్పత్తులను కొనడానికి లేదా ఉపయోగించడానికి అనుమతించబడరు. సిగరెట్లు, సిగార్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ఈ నిషేధం వర్తిస్తుంది. పొగాకు ఉత్పత్తులు కొనుగోలు చేసే ఎవరైనా పుట్టిన సంవత్సరాన్ని రిటైలర్లు ధృవీకరించాల్సి ఉంటుంది.

 కొనుగోలుదారులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నారో లేదో నిర్ధారించిన తర్వాతే అమ్మాలి. గతేడాది ఈ-సిగరెట్లు, వేపింగ్ పరికరాలను నిషేధించిన మాల్దీవులు ప్రభుత్వం.. తాజాగా నిర్ణయం దేశంలో పొగాకు వ్యతిరేక విధానాన్ని తదుపరి స్థాయికి తీసుకెళుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ధూమపాన హానికరమైన ప్రభావాల నుండి భవిష్యత్ తరాలను రక్షించే దిశగా ఈ నిర్ణయాన్ని సాహసోపేతమైన అడుగుగా ప్రభుత్వ అధికారులు అభివర్ణించారు.

 ధూమపానంపై మాల్దీవులు విధించిన శాశ్వాత నిషేధంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం పొగాకు ఉత్పత్తుల బ్లాక్ మార్కెట్‎కు దారి తీస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. బలమైన పర్యవేక్షణ, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు ఈ విధానాన్ని విజయవంతం చేస్తాయని అధికారులు విశ్వసిస్తున్నారు.