భూమి మీద కాదు అంతరిక్షంలో డేటా ప్రాసెసింగ్.. గూగుల్ ప్రాజెక్ట్ 'సన్‌క్యాచర్' ఏంటంటే..?

భూమి మీద కాదు అంతరిక్షంలో డేటా ప్రాసెసింగ్.. గూగుల్ ప్రాజెక్ట్ 'సన్‌క్యాచర్' ఏంటంటే..?

ప్రస్తుత ఏఐ యుగంలో అవసరాలను తీర్చేందుకు అమెరికా టెక్ దిగ్గజం గూగుల్‌ మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. “ప్రాజెక్ట్‌ సన్‌క్యాచర్” పేరుతో కంపెనీ అంతరిక్షంలోనే ఏఐ డేటా ప్రాసెసింగ్ చేసేందుకు పరిశోధనను ప్రారంభిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం భారీ స్థాయిలో మెషీన్‌ లెర్నింగ్‌ మోడళ్లను సూర్యశక్తితో నడిచే ఉపగ్రహాలపై నేరుగా ప్రాసెసింగ్ చేయటమే.

ఈ ప్రయోగం కింద సూర్యుని కాంతిని నిరంతరం అందుకునే సన్‌-సింక్రోనస్‌ లో-ఎర్త్‌ ఆర్బిట్‌లో గూగుల్‌ శాటిలైట్లు తిరుగుతూ సోలార్ ఎనర్జీ నుంచి గరిష్ఠ ఉత్పాదకతను సాధిస్తాయి. భూమిపై ఉన్న డేటా సెంటర్లతో పోలిస్తే ఈ అంతరిక్ష ఉపగ్రహాల్లోని సోలార్ ప్యానెల్స్‌ 8 రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా శక్తి వినియోగంలో సామర్థ్యం పెరుగుదల వల్ల బ్యాటరీలపై ఆధారపడే అవసరం చాలా తగ్గిపోతుంది.

ప్రతి ఉపగ్రహంలో గూగుల్‌ టెన్సర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు (TPUs) అమర్చబడతాయి. ఈ ఉపగ్రహాలు ఫ్రీ-స్పేస్‌ ఆప్టికల్‌ లింక్స్‌ ద్వారా పరస్పరం కమ్యూనికేట్‌ చేసుకుంటూ.. భారీ స్థాయిలో మెషీన్‌ లెర్నింగ్‌ పనులను పంచుకుంటాయి. భూమిపై ఉన్న డాటా సెంటర్ల స్థాయిలో వేగం సాధించాలంటే.. ఈ లింకులు సెకనుకు 10 టెరాబిట్‌ల వేగంతో డేటా ప్రసారం చేయగలగాలి. దీంతోపాటు ఉపగ్రహాలు కొన్ని కిలోమీటర్ల నుంచి వందల మీటర్ల వరకు దగ్గరగా ఏర్పాటవుతాయి. ఈ ప్రాజెక్ట్‌లో వినియోగించే ట్రిల్లియమ్‌ TPU v6e చిప్‌లపై గూగుల్‌ ఇప్పటికే రేడియేషన్‌ పరీక్షలు నిర్వహించింది. 5 ఏళ్ల మిషన్‌లో కొనసాగించటానికి అవసరమైన పనితీరు ఇవి కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. 

ఆర్థికపరంగా కూడా గూగుల్‌ ఈ ప్రయోగాన్ని సాధ్యమని అంచనా వేస్తోంది. వచ్చే దశాబ్దంలో కిలోగ్రామ్‌ లాంచ్‌ ఖర్చు 200 డాలర్ల కంటే తక్కువకు చేరుతుందని అంచనా. 2030ల మధ్య నాటికి ఈ అంతరిక్ష డేటా సెంటర్ల నిర్వహణ ఖర్చులు భూమిపై ఉన్న సదుపాయాల స్థాయికి చేరుతాయని గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే ఇంజనీర్లకు మాత్రం ఇందులో అనేక సవాళ్లు ఉన్నాయి. టెంపరేచర్ కంట్రోల్ నుంచి హార్డ్ వేర్, లింక్స్ పనితీరు వంటివి పరిష్కరించాల్సి ఉంటుంది. అందుకే వీటిని ఎదుర్కోవడానికి గూగుల్‌ ప్లానెట్‌ లాబ్స్‌తో కలిపి 2027 నాటికి రెండు ప్రోటోటైప్‌ ఉపగ్రహాలను ప్రయోగించనుంది.