2025 చివరి త్రైమాసికంలోకి ప్రవేశిస్తున్న వేళ.. భారత టెలికాం రంగం మరో సంచలనానికి తెరలేపుతోంది. మార్కెట్ విశ్లేషకుల సమాచారం ప్రకారం దేశంలోని ప్రధాన మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నవంబర్ నుంచి డిసెంబర్ 2025 మధ్య కాలంలో ఛార్జీలను10–20 శాతం వరకు పెంచే అవకాశం ఉందని వెల్లడైంది. ఇది గత 6 ఏళ్లలో నాలుగోసారి టారిఫ్‌లు పెరుగుదలకు దారితీస్తుందని తెలుస్తోంది.
దేశంలో టెలికాం రంగం గత కొన్నేళ్లుగా భారీ పెట్టుబడులు, 5జీ విస్తరణ ఖర్చులు, వృద్ధి చెందుతున్న డేటా వినియోగంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 5జీ నెట్‌వర్క్ పూర్తి విస్తరణ కోసం 2023–24లో కంపెనీలు కలిపి దాదాపు రూ. 2.2 లక్షల కోట్లు పెట్టుబడి చేసినట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ఈ భారీ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవటానికి సంస్థలు వినియోగదారులపై కొంత భారం మోపాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
సగటు ఆదాయం పెంపునకు..
రిలయన్స్ జియో గత కొన్ని త్రైమాసికాల్లో సగటు ఆదాయాన్ని 200 రూపాయల దరిదాపుల్లో ఉంచగా, ఎయిర్‌టెల్ 209 రూపాయల వరకు పెంచింది. అయితే 5జీ నిర్వహణ ఖర్చులు, స్పెక్టర్‌మ్ చార్జీలు, కస్టమర్ సబ్సిడీల కారణంగా లాభదాయకత తగ్గుతుండటంతో చేసేదేం లేక మరోసారి ధరల పెంపు అనివార్యంగా మారిపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : కుప్పకూలిన బిట్‌కాయిన్
టెలికాం రంగానికి రాబోయే నెలలు ఆర్థికంగా కీలకమైనవిగా భావిస్తున్నారు. ఈ ధరల పెంపు ద్వారా ప్రతి సంస్థకు వార్షిక ఆదాయంలో 12–15 శాతం వృద్ధి సాధ్యమవుతుందని CLSA, మోర్గాన్ స్టాన్లీ వంటి విశ్లేషణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా వంటి ఆర్థికంగా బలహీనమైన ఆపరేటర్లకు ఈ పెంపు కొంత ఊరట ఇవ్వవచ్చని నిపుణులు అంటున్నారు.
ఇక వినియోగదారులపై ప్రభావం దృష్ట్యా, నెలవారీ చార్జీలు, ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాకేజీల ధరలు పెరగవచ్చు. 4జీ, 5జీ సేవల మధ్య ధర వ్యత్యాసం కూడా క్రమంగా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అయితే దీనితోపాటు కంపెనీలు మెరుగైన నెట్‌వర్క్ నాణ్యత, వేగం, కనెక్టివిటీని అందించడంపై దృష్టి పెట్టబోతున్నాయని తెలుస్తోంది.
