Crypto: కుప్పకూలిన బిట్‌కాయిన్.. మళ్లీ పెరుగుతుందా..? అసలు ఎందుకిలా..

Crypto: కుప్పకూలిన బిట్‌కాయిన్.. మళ్లీ పెరుగుతుందా..? అసలు ఎందుకిలా..

Crypto Investment: ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను భారీగా ఆకట్టుకున్న క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. అమెరికా స్టాక్ మార్కెట్లలో టెక్, ఏఐ స్టాక్స్ దిశగా ఇన్వెస్టర్లు మళ్లటమే క్రిప్టోల కొంప ముంచుతోందని వెల్లడైంది. బుధవారం రోజున బిట్ కాయిన్ ధర 7 శాతం తగ్గటంతో జూలై తర్వాత తొలిసారిగా దీని ధర లక్ష డాలర్ల మార్క్ కిందకు పడిపోయింది. అయితే కొన్ని రోజులుగా క్రిప్టోల పతనంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ పెరగుతాయా లేదా అనే భయాలు చాలా మందిని వెంటాడుతున్నాయి. 

ఇదే సమయంలో మరో అతిపెద్ద క్రిప్టో అయిన ఇథిరియం కూడా 16 శాతం తగ్గి 3060 డాలర్లకు చేరుకుంది. రెండు నెలల్లో ఇది ఆల్ టైమ్ గరిష్ట ధర నుంచి 38 శాతం క్షీణతను చూసింది. బిట్ కాయిన్ కూడా ఆల్ టైమ్ హై నుంచి దాదాపు 22 శాతం విలువను కోల్పోవటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ రిస్క్-ఆఫ్ రొటేషన్ సంకేతాలు స్థూల ఆర్థిక రంగంలో డిజిటల్ ఆస్తులపై పెట్టుబడిదారుల ప్రణాళికలు మార్చుకునేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు క్షీణిస్తున్న సంస్థాగత డిమాండ్, రిస్క్-ఆఫ్ సెంటిమెంట్లు క్రిప్టో టోకెన్లను మరింత కలవరపెడుతున్నాయని వారు చెబుతున్నారు. 

గడచిన 24 గంటల సమయంలో బిట్ కాయిన్ 99వేల డాలర్ల సపోర్ట్ జోన్ టెస్ట్ చేసిన తర్వాత తిరిగి రికవరీతో లక్షా 2వేల మార్కుకు తిరిగి చేరుకుంది. దీంతో మార్కెట్లు తిరిగి కోలుకుంటున్నాయనే సంకేతాన్ని ఇది పంపించింది. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే.. 2017 ర్యాలీలో బిట్‌ కాయిన్ మొదటిసారి 20,000 డాలర్ల మార్క్ చేరుకోవడానికి ముందు 30–40 శాతం ఆరు ప్రధాన కరెక్షన్‌లను చూసింది. 

ప్రస్తుతం ETF అవుట్‌ఫ్లోలు, దీర్ఘకాలిక హోల్డర్ డిస్ట్రిబ్యూషన్‌లు వారాంతపు లిక్విడిటీని తగ్గించడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీనికి అదనంగా తరచుగా వస్తున్న అమెరికా టారిఫ్స్ మార్పు ప్రకటనలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం క్రిప్టోల చరిత్రలో అతిపెద్ద లిక్విడేషన్ ప్రక్రియ కొనసాగుతోందని కాయిన్ గ్లాస్ డేటా చెబుతోందని నిపుణులు అంటున్నారు. మెుత్తానికి ఈ పరిస్థితులు చూస్తుంటే నిపుణులు అంచనా వేసినట్లుగా క్రిప్టోల్లో బుల్ సైకిల్ అయిపోయి బేర్ సైకిల్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తోంది.