మిడిల్ క్లాస్ యువతకు హెచ్చరిక.. భవిష్యత్తు నిరుద్యోగానికి మీరు సిద్ధంగా ఉన్నారా..?

మిడిల్ క్లాస్ యువతకు హెచ్చరిక.. భవిష్యత్తు నిరుద్యోగానికి మీరు సిద్ధంగా ఉన్నారా..?

ప్రపంచంతో పాటు భారతదేశంలోనూ జాబ్ మార్కెట్లో భారీ మార్పులు రాబోతున్నాయి. ఇకపై ఫుల్ టైమ్ జాబ్ లేదా పర్మనెంట్ జాబ్స్ అనే కాన్సెప్ట్ కి కాలం చెల్లుతోందని తెలుస్తోంది. భవిష్యత్తులో భారతీయ యువత నిరుద్యోగానికి సిద్ధంగా ఉండాల్సిన టైం వచ్చేసిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితులు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి భారతీయులపై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయి అనే ఆసక్తికరమైన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో వైట్ కాలర్ ఉద్యోగాల వృద్ధి ఆగిపోయిందని, ఇక భవిష్యత్తులోనూ తిరిగి పుంజుకునే అవకాశం తక్కువని మార్సెలస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. ఇది తాత్కాలిక మందగమనం కాదని.. భారత ఆర్థిక వ్యవస్థలో రాబోతున్న కీలక మార్పుగా చెప్పారు. ఇండియా ప్రస్తుతం కొత్త దశలోకి అడుగుపెడుతోందని.. గ్యారెంటీ ఉండే ఆఫీస్ జాబ్స్ తగ్గిపోతాయని వెల్లడించారు ముఖర్జియా. ఇక స్వయం ఉపాధి, ఫ్రీలాన్స్‌, గిగ్‌ వర్క్ ప్రధానంగా మారతాయన్నారు.

గత 5 ఏళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాల సంఖ్య దాదాపు స్థిరంగానే ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌, ఆసియన్‌ పెయింట్స్‌ వంటి ప్రముఖ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించకుండానే వేగంగా ఎదుగుతున్నాయని.. ఏఐతో ఆటోమేషన్‌ కారణంగా ఇప్పుడు చిన్న టీమ్‌లతోనే కంపెనీలు భారీ స్థాయిలో వృద్ధిని సాధిస్తున్నట్లు వాస్తవ పరిస్థితులను వెల్లడించారు. 

ప్రస్తుతం ఇండియాలో ఏటా 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు జాబ్ మార్కెట్లోకి చదుపు పూర్తి చేసుకుని వస్తున్నారు. అయితే వీరికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో కార్పొరేట్ వాతావరణం లేదని ఏఐ యుగంలో ముఖర్జియా హెచ్చరిస్తున్నారు. కొత్తగా రాబోయే తరం యువతకు జీవనోపాధి ఎలా సృష్టించాలన్నది దేశం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయంగా ముఖర్జియా చెప్పారు. యుతవ కూడా దీనిపై ఫోకస్ చేయాల్సిందేనని చెబుతున్నారు. కేవలం కంటెంట్ ఉన్నోడికే భవిష్యతులో ఆఫీస్ జాబ్స్.. ఇక మిగిలినోళ్లకు ఫ్రీలాన్స్, చేతి పనులు, కంటెంట్ క్రియేటర్ వంటి ప్రత్యామ్నాయాలే దిక్కని తెలుస్తోంది. 

యువ జనాభా, చవక డేటా, ఆధార్‌, యుపీఐ వంటి డిజిటల్‌ వ్యవస్థలు ఈ కొత్త గిగ్‌ ఎకానమీని బలపరిచే పునాదిగా మారతాయని ముఖర్జియా చెప్పారు. ఈ క్రమంలో మన మందరం జీవితం మొత్తం గిగ్‌ వర్కర్లుగా తయారుకావడానికి సిద్ధం కావాల్సిందేనని ఆయన హెచ్చరిస్తున్నారు.