Supreme Court : ఇలా అయితే 'థియేటర్లు ఖాళీ అవడం ఖాయం'.. టికెట్, స్నాక్స్ ధరలపై సుప్రీంకోర్టు సీరియస్!

Supreme Court : ఇలా అయితే 'థియేటర్లు ఖాళీ అవడం ఖాయం'..  టికెట్, స్నాక్స్ ధరలపై సుప్రీంకోర్టు సీరియస్!

సినిమా చూడాలంటే నామాన్యుడి జేబుకు చిల్లు పడాల్సిందే. కొత్త మూవీ రిలీజ్ అయితే చాలు టికెట్‌ ధరల నుంచి థియేటర్‌ లోపల అమ్మే తినుబండారాల వరకు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ తరుణంలో  వీటిపై సామాన్య సినీ ప్రేక్షకుల్లో ఉన్న ఆగ్రహాన్ని భారత సుప్రీంకోర్టు కూడా గట్టిగా వినిపించింది. మల్టీప్లెక్స్‌లలో అధిక ధరల విధానం ప్రేక్షకులను థియేటర్ల నుండి దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని నియంత్రించకపోతే సినిమా హాళ్లు ఖాళీ అవడం ఖాయమని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది.

కర్ణాటక టికెట్ ధరల పరిమితి కేసు

కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో ఏ సినిమా టికెట్‌ ధర కూడా రూ.200 దాటకూడదని తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. జస్టిస్ విక్రమ్ నాథ్ మాట్లాడుతూ.. థియేటర్లలో విక్రయించే ఆహార, పానీయాల ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఒక్క నీళ్ల బాటిల్‌కు రూ.100, కాఫీకి రూ.700 వసూలు చేస్తారా?" అని ప్రశ్నించారు. ఈ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకపోతే థియేటర్లకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుందని కోర్టు అభిప్రాయపడింది.

సామాన్యుడి జేబుకు చిల్లు..

ప్రస్తుతం ఒక సగటు కుటుంబం మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే టికెట్, స్నాక్స్, పానీయాలతో కలిపి రూ1,500 నుంచి రూ.2,000 ఖర్చు చేయాల్సి వస్తోంది.  బయట రూ.50 ఉన్న కూల్‌డ్రింక్ థియేటర్‌లో  రూ.400కి పైగా ఉంది. ఒక చిన్న పాప్‌కార్న్ టబ్ రూ.500కి పైగా అమ్ముతున్నారు. ఈ ధరల వల్ల సినిమా చూడాలనే ఆనందం లేకుండా పోతుందని కోర్టు వ్యాఖ్యానించింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ,.. ఇది ఐచ్ఛికం. ధర ఎక్కువ ఉంటే... ప్రేక్షకులు మామూలు థియేటర్లకు వెళ్లవచ్చు. మల్టీప్లెక్స్‌కే ఎందుకు రావాలి?అని ప్రశ్నించారు. దానికి జస్టిస్ నాథ్ బదులిస్తూ.. ఇప్పుడు మామూలు థియేటర్లు మిగలడం లేదు. టికెట్‌ ధర రూ.200 ఉండాలనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాన్ని మేము సమర్థిస్తున్నాం అని స్పష్టం చేశారు.

 ఐడీ వివరాల సేకరణపై స్టే

ప్రస్తుతం, ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్స్‌ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సినీ పరిశ్రమకు అధిక ధరలు మరింత నష్టం కలిగిస్తున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ కూడా గతంలో ఒక సినిమా చూడటానికి రూ.10,000 ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సర్వే ప్రకారం, అధిక ధరల కారణంగా కరోనా మహమ్మారి తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య 15 శాతం తగ్గింది. అయితే, టికెట్ కౌంటర్లలో నగదు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసే వారి గుర్తింపు కార్డు (ఐడీ) వివరాలు సేకరించాలనే కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు అసాధ్యం అని మల్టీప్లెక్స్ అసోసియేషన్ వాదించింది. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, తక్షణమే ఐడీ వివరాల సేకరణ ఉత్తర్వులపై స్టే విధించింది