దేశం షాక్ అయ్యింది : కొరియర్ అంటూ వచ్చాడు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం

దేశం షాక్ అయ్యింది : కొరియర్ అంటూ వచ్చాడు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం

క్రైమ్ సినిమాలు చూసి యూత్ చెడిపోతుంది అంటుంటారు. కానీ ఒక్కోసారి ఇలాంటి వాళ్లను చూసిన తర్వాతే క్రైమ్ కథలు రాసుకుంటారేమో డైరెక్టర్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కరుడుగట్టిన నేరగాళ్లు మన మధ్య తిరుగుతూ.. గుట్టు చప్పుడు కాకుండా చేయాల్సిన నేరాలను చేసేస్తున్నారు. అందర్లో ఉన్నప్పుడు మంచి వారిలా నటిస్తూ.. లోలోపల తల్లిదండ్రులు కూడా ‘ఉరి తీయండి నా కొడుకుని’  ‘అది నా కూతురు కాదు.. చంపేయండి’ అని అసహ్యించుకునేలా చేస్తున్నారు ఈ దుర్మార్గులు. 

అది పదకొండో అంతస్తు.. అమ్మాయి ఒంటరిగా ఉంటుందని ఎప్పుడు రెక్కీ నిర్వహించాడో. డెలివరీ బాయ్ లాగా వెళ్లి.. మేడం మీకు పార్సిల్ వచ్చింది.. అంటూ ఫ్లాట్ లోకి ఎంటరయ్యాడు. నేను ఆర్డర్ చేయలేదే.. అంటూనే డోర్ ఓపెన్ చేసింది. లోపలికి వెళ్లిన దుండగుడు.. ఆమె ముఖంపై స్ప్రే కొట్టి అత్యంత కిరాతకంగా దారుణానికి పాల్పడ్డాడు. పైగా ఫోటోలు తీసి.. ఆ అమ్మాయి కనపడకుండా క్రాప్ చేసిన ఇమేజ్ చూపిస్తూ.. ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో షేర్ చేస్తా.. నీ బతుకు బస్టాండే అని చెప్పి వెళ్లి పోయాడు. ఈ దారుణ ఘటన పుణెలో జరిగింది. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పుణె కొంధ్వా ఏరియాలోని ఓ రెసిడెన్సీలో ఉండే 22 ఏళ్ల యువతి డేటా సైన్స్ లో ఇంజినీరింగ్ చేస్తూ.. కళ్యాణినగర్ లోని ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తోంది. 2022 నుంచి తన తమ్ముడితో ఆ రెసిడెన్సీలోని 11వ ఫ్లోర్ లో రెంట్ కు ఉంటున్న ట్లు ఆ సొసైటీకి సంబంధించిన వ్యక్తి చెప్పారు. పదకొండు అంతస్తుల బిల్డింగ్ ను A, B, C వింగులుగా విభజించి, ఎప్పుడూ ఇద్దరు సెక్యూరిటీలు ఉండేలా ఏర్పాటు చేశారు. అందులో ఏ వింగ్ కు వెళ్లాలన్నా ఒకే ఎంట్రెన్స్ నుంచి వెళ్లాలి. అలాంటి బిల్డింగ్ లోకి సెక్యూరిటీకి మాయమాటలు చెప్పి.. 11వ ఫ్లోర్ కు వెళ్లి దారుణానికి పాల్పడటం సంచలనంగా మారింది. 

అకోలా కు చెందిన అక్కా తమ్ముడు.. జాబ్ కోసం పుణెకు షిఫ్ట్ అయ్యారు. తమ్ముడు తిరిగి అకోలా వెళ్లడంతో ఒంటరిగా ఉంటుంది ఆ యువతి. అయితే ఎప్పట్నుంచి నిఘా ఉంచాడో.. ఎప్పుడు రెక్కీ నిర్వహించాడో కానీ.. క్రైమ్ సినిమాలో లాగే దారుణానికి పాల్పడినట్లు 4వ జోన్ డీసీపీ రాజ్ కుమార్ షిండే చెప్పారు.

సైన్ చేసేందుకు పెన్ను తెచ్చేలోపే:

‘‘బుధవారం (జులై 02) సాయంత్రం 7.15 గంటలకు డోర్ బెల్ మోగింది. మేడం మీకు బ్యాంకు నుంచి పార్సిల్ వచ్చిందని డెలివరీ బాయ్ కనిపించాడు. డెలివరీ రిసీప్ట్ మీద సైన్ చేయాలని.. పెన్ను మర్చిపోయాను అని చెప్పాడు. పెన్ను తెద్దామని ఇంట్లోకి వెళ్తుంటే వెంటనే డోర్ క్లోజ్ చేసి.. నా ముఖంపై ఏదో కెమికల్ స్ప్రే చేశాడు.’’ అని యువతి చెప్పినట్లు డీసీపీ తెలిపారు.

‘‘ఆ  తర్వాత ఆ యువతి 8.30 కు స్పృహలోకి వచ్చింది. తనపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించింది. వెంటనే వాళ్ల బంధువులకు ఫోన్ చేయగా అందరూ వచ్చి జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెడికల్ పరీక్షల కోసం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాం. ఆమె ముఖంపై చల్లిన స్ప్రే ఏంటో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. కొంధ్వా పోలీస్ స్టేషన్ నుంచి 10 టీమ్ లను రంగంలోకి దింపాం. నిందితుడిని పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ కూడా పనిచేస్తోంది’’ అని డీసీపీ చెప్పారు. 

బుధవారం ఘటన జరిగిన రెసిడెన్సీకి 10 మంది డెలివరీ బాయ్స్ వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించారు విచారణ అధికారులు . వారిని విచారించనున్నట్లు తెలిపారు. అయితే డెలివరీ బాయ్ గా వచ్చిన నిందితుడు.. విజిటర్స్ రిజిస్టర్ లో వివరాలు ఎంట్రీ చేయకుండానే ఫ్పాట్ కు వెళ్లినట్లు విచారణలో తేలింది. 

రెసిడెన్సీలో కనీసం నాలుగైదు ఆర్డర్స్ డెలివరీ చేసే బాయ్.. యువతి రూమ్ కు వెళ్లినట్లు నిర్ధారించారు. ఎందుకంటే కాంప్లెక్స్ లోకి ఎంట్రీ అయినప్పుడు ఒక్కసారి సంతకం చేస్తే సరిపోతుంది. ప్రతీ  డెలివరీకీ సంతకం అవసరం లేదు. అందుకే ఎంట్రీ అయినప్పుడే సైన్ చేసి.. అన్ని వింగ్స్ లో ఆర్డర్స్ డెలివరీ చేస్తూ.. చివరికి యువతి ఫ్లాట్ కు వెళ్లినట్లు నిర్ధారించారు. 

డెలివరీ బాయ్స్ అంటే.. మనం ఆర్డర్ చేసింది ఇచ్చేసి వెళ్తారులే అనే ఆలోచనలో ఉంటాం. కానీ ఇలాంటి డెలివరీ బాయ్స్ కూడా ఉంటారు. ఫ్లాట్స్ లో ఒంటరిగా ఉండే మహిళలు ఇలాంటి విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాల్సిందేనని అంటున్నారు పోలీసులు. మనుషుల్లో ఉండే మానవ మృగాల నుంచి జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.